Sumalatha Ambareesh: శృంగేరి శారదాంబ ఆలయంలో సీఎం కుమారస్వామి పుత్రుడు నిఖిల్ నామినేషన్ పత్రాలకు పూజలు
- రసవత్తరంగా మారిన మాండ్యా పోరు
- నిఖిల్‌పై పోటీ చేస్తున్న సుమలత
- ఆమె గురించి ఆలోచించడం లేదన్న కుమారస్వామి
కర్ణాటకలోని మాండ్యా లోక్‌సభ స్థానం భలే రసవత్తరంగా మారింది. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ బరిలోకి దిగుతుండగా, మాజీ మంత్రి అంబరీష్ భార్య సుమలత స్వతంత్ర అభ్యర్థిగా ఆయనపై పోటీకి దిగారు. దీంతో ఇక్కడి పోటీ హోరాహోరీగా మారే అవకాశం ఉంది. మాండ్యా నుంచి బరిలోకి దిగుతున్న నిఖిల్ తన నామినేషన్ పత్రాలకు శృంగేరీ శారదాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.
కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కుమారస్వామి మాట్లాడుతూ.. సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు శారదాదేవి ఆశీర్వాదం ఉండాలన్న సీఎం.. అమ్మవారి ఆశీర్వాదం పొందడం తమ కుటుంబ సంప్రదాయమన్నారు. తాను నిఖిల్ ఒక్కడి పూజలకు మాత్రమే రాలేదని, 28 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అభ్యర్థులు గెలవాలని పూజలు చేసినట్టు చెప్పారు. సుమలత పోటీ గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదని కుమారస్వామి తేల్చి చెప్పారు.