Hyderabad: మరొకరితో నిశ్చితార్థం జరిగిందని.. యువతిపై కత్తెరతో దాడిచేసిన ప్రేమోన్మాది

  • జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • నిందితుడు శ్రీకాకుళం జిల్లా వాసి
  • ప్రాణాపాయం నుంచి బయటపడిన యువతి

తనను పెళ్లాడేందుకు నిరాకరించి మరో యువకుడితో నిశ్చితార్థం చేసుకుందన్న కోపంతో యువతిపై ఓ ప్రేమోన్మాది దాడికి తెగబడ్డాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడలోని జవహర్‌నగర్‌కు చెందిన ఓ యువతి పదో తరగతి వరకు చదివి ఇంట్లోనే ఉంటోంది. రెండేళ్ల క్రితం యూసుఫ్ అనే వ్యక్తి యువతి కుటుంబం నివసిస్తున్న భవనం కింద టైలరింగ్ షాపు పెట్టుకున్నాడు.

యూసుఫ్ టైలరింగ్ షాపులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వై.దుర్గాప్రసాద్ (25) పనికి చేరాడు. అదే బిల్డింగ్‌లో ఉంటున్న యువతిపై అతడి దృష్టి పడడంతో ఆమె బయటకు వెళ్లినప్పుడల్లా అనుసరించేవాడు. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు. ఇటీవల ఇంకాస్త ముందుకు వెళ్లి ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. అందుకామె నిరాకరించింది. అయినా వేధింపులు ఆపని దుర్గాప్రసాద్ తనను పెళ్లాడమని బలవంతం చేసేవాడు.

ఈ క్రమంలో ఆమెకు ఈ నెల 2న మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. విషయం తెలిసిన దుర్గాప్రసాద్ జీర్ణించుకోలేకపోయాడు. ఆదివారం నేరుగా ఆమె ఇంటికి వెళ్లి గొడపడ్డాడు. ఆపై వెంట తెచ్చుకున్న కత్తెరతో దాడి చేశాడు. దీంతో యువతి చెవి, గొంతుకు గాయాలయ్యాయి. యువతి కేకలు విని దుకాణంలో ఉన్న యూసుఫ్ వెంటనే పైకొచ్చి దుర్గాప్రసాద్‌ను అడ్డుకుని యువతిని రక్షించాడు. ఆపై పోలీసులకు సమాచారం అందించడంతో వారొచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయాలపాలైన యువతిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad
Srikakulam District
Lover
Attack
Yousufguda
Telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News