India: మావోయిస్టుల దాడిలో సీఆర్పీఎఫ్ జవాను మృతి
- ఐదుగురికి గాయాలు
- దంతెవాడ జిల్లాలో ఘటన
- మందుపాతర పేల్చి ఆపై కాల్పులు జరిపిన మావోలు
చత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. దంతెవాడ జిల్లాలోని సీఆర్పీఎఫ్ దళాలకు చెందిన కమల్ పోస్టు వద్ద దాడి చేసి ఒక జవానును బలిగొన్నారు. సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో 231వ బెటాలియన్ కు చెందిన జవాన్లపై ఐయూడీ పేలుడు పదార్థాలతో దాడిచేసి ఆపై తుపాకులతో కాల్పులు జరిపారు. సీఆర్పీఎఫ్ జవాన్లు అరణ్ పూర్ రహదారి బందోబస్తులో భాగంగా భద్రత విధులు నిర్వర్తిస్తుండగా మావోలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఒక సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. మరో ఐదుగురు గాయపడ్డారు. మావోల దాడిని సీఆర్పీఎఫ్ దళాలు దీటుగా తిప్పికొట్టాయి. గాయపడిన జవాన్లను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అరణ్ పూర్ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.