Chandrababu: జగన్ కు కేసీఆర్ డబ్బు పంపిస్తున్నారు: చంద్రబాబు
- నా దగ్గర డబ్బుల్లేవు
- అభివృద్ధి చేసి చూపించా
- ఘనవిజయం సాధిస్తాం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి కేసీఆర్, జగన్ ద్వయంపై విమర్శల జడివాన కురిపించారు. సోమవారం ఒంగోలు పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ఆటలు ఆంధ్రాలో సాగవని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ ఎన్నికల్లో గెలిచినవారిని తమ పార్టీలోకి లాగేసుకుంటున్నారని, తనకు ఎదురులేకుండా చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 16 మంది ఎంపీలతో ఢిల్లీలో చక్రం తిప్పుతానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడని, ఢిల్లీలో కేసీఆర్ మాటలు వినేవాళ్లెవరూ లేరని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ జగన్ ను అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల సందర్భంగా జగన్ కు కేసీఆర్ డబ్బు పంపిస్తున్నారని ఆరోపించారు. అయినా కేసీఆర్ పంపిన డబ్బుతో జగన్ గెలుస్తాడా? అంటూ ప్రశ్నించారు. అయితే, తన వద్ద డబ్బుల్లేవని, తాను చేసిన ప్రగతే తనకు ఓట్లు పడేలా చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏమీ చేయని కేసీఆరే 88 స్థానాల్లో గెలిస్తే, ఎంతో కష్టపడిన తనకు ఇంకెన్ని సీట్లు రావాలని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఇక, జగన్ పైనా విమర్శనాస్త్రాలు సంధిస్తూ, ఏపీలో నివసించడు కానీ ఏపీలో ఓట్లు మాత్రం కావాలంటారు... ఇలాంటి నాయకుడు ఏపీకి అవసరమా? అని ప్రశ్నించారు.