Jagan: చూశాను... విన్నాను... నేనున్నాను: ఓర్వకల్లు బహిరంగ సభలో జగన్

  • ప్రజల సమస్యలను కళ్లారా చూశా
  • వారి బాధలను చెబుతుంటే విన్నాను
  • అన్ని సమస్యలను పరిష్కరించేందుకు నేనున్నాను

ఇటీవలి తన పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లారా చూశానని, వారి బాధలను చెప్పుకుంటుంటే విన్నానని, అన్ని సమస్యలను పరిష్కరించేందుకు తానున్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గ పరిధిలోని ఓర్వకల్లులో జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, పిల్లల ఉన్నత చదువులకు ఆస్తులమ్ముకుంటున్న తల్లిదండ్రులను తాను చూశానని వారికి ఇకపై ఆ పరిస్థితి రాబోదని భరోసా ఇచ్చారు. చదువు పూర్తి చేసుకున్న బిడ్డకు అండగా ఉండి, ఉద్యోగం ఇప్పిస్తానని అన్నారు.

మూడు నాలుగు రోజుల్లో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామని చెప్పిన ఆయన, గతంలో తాను చెప్పిన నవరత్నాలతో పాటు మరిన్ని అంశాలను అందులో జోడిస్తానని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం బెల్టుషాపులతో ఆడపడుచుల ఇళ్లలో చిచ్చు పెట్టిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. గడచిన ఐదేళ్లలో ప్రజలకు ఎటువంటి మేలూ జరగలేదని మండిపడిన ఆయన, ప్రతి కుటుంబానికీ మేలు జరగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు.

కాగా, తన పాదయాత్రలో భాగంగా, కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గాల్లో పర్యటించిన జగన్, మిగిలిన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిమిత్తం సభలను నిర్వహించనున్నారు.

Jagan
Panyam
Orvakallu
YSRCP
  • Loading...

More Telugu News