Nizamabad District: తనపై 1000 మంది పోటీ చేస్తారన్న వార్తలపై స్పందించిన కవిత!

  • ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చు
  • రైతు సమస్యలు ఆంధ్రా పాలకుల చలవే
  • బీజేపీ చేసిందేమీ లేదు: కవిత

నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో తనపై 1000 మంది పోటీ చేయనున్నారని వచ్చిన వార్తలపై ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరికైనా అర్హత ఉందని ఆమె వ్యాఖ్యానించారు. జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యలు ఈనాటివి కావని, దశాబ్దాల పాటు పరిపాలించిన ఆంధ్రా పాలకుల వైఖరి వల్లే వచ్చినవని అన్నారు.

ఈ ఉదయం నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని చెప్పారు. తమ సమస్యల పరిష్కారం కోసం చూస్తున్న రైతు సంఘాలతో చర్చిస్తానని చెప్పారు. ఇండియాకన్నా చిన్న దేశాలు, పేద దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని వ్యాఖ్యానించిన కవిత, కొందరి వైఖరితోనే ఇండియా వెనుకబడివుందని అన్నారు. జాతీయ స్థాయిలో సైతం కేసీఆర్ వంటి నేతల అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.

బీజేపీకి అధికారం ఇస్తే, ఒకసారి నోట్లు, మరోసారి టాక్స్ మార్చారని, వందలసార్లు మాట మార్చారని ఎద్దేవా చేశారు. ఎన్నికలప్పుడు తప్ప బీజేపీకి గుడి గురించిన ఆలోచనే రాదని విమర్శలు గుప్పించారు. ఈ ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం నుంచి ప్రజలకు జరిగిన మంచి ఏమీ లేదని వ్యాఖ్యానించారు. పుల్వామాలో దాడి జరిగితే, మరణించిన జవాన్లకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున ప్రకటించిన ఏకైక సీఎం కేసీఆరేనని, బీజేపీ పాలిత రాష్ట్రాలు అమర జవాన్లకు ఏం చేశాయో చెప్పాలని ప్రశ్నించారు.

Nizamabad District
K Kavitha
Elections
TRS
KCR
  • Loading...

More Telugu News