Nandyal: టికెట్ ఇవ్వకుంటే టీడీపీకి షాకివ్వనున్న ఎస్పీవై రెడ్డి!
- నంద్యాల లోక్ సభ సీటును ఆశిస్తున్న ఎస్పీవై రెడ్డి
- టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని టీడీపీ సంకేతాలు
- స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయం!
- 22న నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు
నంద్యాల లోక్ సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ను ఆశిస్తున్న సీనియర్ నేత ఎస్పీవై రెడ్డి, తనకు సీటివ్వకుంటే, ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమన్న సంకేతాలు ఇచ్చారు. ఈ స్థానం కోసం పోటీ అధికంగా ఉండటం, ఇటీవల టీడీపీలో చేరిన కోట్ల కుటుంబంతో పాటు, ఉమ్మడి రాష్ట్రంలో అదనపు ఎస్పీ హోదాలో పనిచేసి, పదవీ విరమణ తరువాత టీడీపీలో చేరిన మాండ్ర శివానందరెడ్డి తదితరులతో పాటు, భూమా ఫ్యామిలీ సైతం టికెట్ ను కోరుతున్నాయి.
దీంతో తనకు టికెట్ దక్కే అవకాశాలు తగ్గుతున్నాయని తెలుసుకున్న ఎస్పీవై రెడ్డి, పార్టీని నమ్ముకుని ఉన్న తనకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ముందుగా అనుకున్న ప్రకారం, తాను 22వ తేదీన నామినేషన్ వేయాలనే నిర్ణయించుకున్నానని తన అనుచరులకు స్పష్టం చేశారని తెలుస్తోంది. వాస్తవానికి 2014 ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డి నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆపై 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన ఆయన, కొద్ది రోజుల్లోనే తెలుగుదేశం కండువా కప్పేసుకున్నారు. ఇప్పుడు టికెట్ రాకుంటే, తిరిగి వైసీపీలోకి వెళ్లినా టికెట్ దక్కే చాన్స్ లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండాలని భావిస్తున్నారు.