Chandrababu: పేద ప్రజలకు కాదు... జగన్ వంటి అవినీతిపరులకు మోదీ చౌకీదార్: ప్రధానిపై ధ్వజమెత్తిన చంద్రబాబు
- భీమడోలు సభలో బాబు విమర్శల పర్వం
- మోదీ దొంగలకు కాపలాదారు
- రాష్ట్రానికి నమ్మకద్రోహం చేశాడు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్రలో సుడిగాలి వేగంతో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఉదయం విజయనగరం జిల్లా నుంచి మొదలుపెట్టిన ఆయన విశాఖ, కాకినాడల్లో భారీ బహిరంగ సభలలో పాల్గొని ఆపై రాత్రికి పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన సభలో కూడా తరగని ఉత్సాహంతో ప్రసంగించి కార్యకర్తలను, అభిమానులను రంజింపచేశారు.
'ఏం తమ్ముళ్లూ, ఆడబిడ్డలూ హుషారుగా ఉన్నారా? లేదా?' అంటూ మొదలుపెట్టిన చంద్రబాబు... గత ఎన్నికల్లో టీడీపీకి ఘనవిజయం సాధించిపెట్టిన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అని, తనకు ఎంతో ఇష్టమైన జిల్లా అని కొనియాడారు. ఆ తర్వాత హైదరాబాద్ అభివృద్ధికి తాను కారణమైతే కేసీఆర్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని, తనతో పాటు టీడీపీ సభలకు వచ్చిన కేసీఆర్ ఇవాళ తననే బెదిరిస్తున్నారంటూ మండిపడ్డారు.
ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయడం చారిత్రక అవసరమని చంద్రబాబునాయుడు అన్నారు. అంతేకాకుండా కార్యకర్తలకు ప్రత్యేక సందేశం అందించారు. మీరు ప్రజలను చూసుకోండి, మిమ్మల్ని నేను చూసుకుంటానంటూ భరోసా ఇచ్చారు. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పలు విమర్శలు చేశారు.
"నరేంద్ర మోదీ మనల్ని మోసం చేస్తున్నారు. మోదీ నమ్మకద్రోహం చేశారు. ప్రత్యేకహోదా ఇస్తామంటూ రాష్ట్రంలో అనేక సభల్లో చెప్పారు. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. చౌకీదార్ అంటాడు, కాపలాదారు అంటాడు. ఎవరికీ కాపలా? దొంగలకు కాపలా కాస్తుంటాడు. జగన్ లాంటి అవినీతిపరులకు కాపలా కాస్తుంటాడు తప్ప పేద ప్రజలకు కాపలా కాయడు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా మనం అభివృద్ధి పథంలో పయనిస్తున్నాం" అంటూ ప్రసంగించారు.