India: 1947కి ముందూ పాకిస్థాన్ లేదు... 2025 తర్వాతా పాకిస్థాన్ ఉండదు: ఆర్ఎస్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు
- ఆరేళ్లలో పాకిస్థాన్ భారత్ లో కలిసిపోతుంది
- కరాచీ, లాహోర్ నగరాల్లో భూములుకొనుక్కోవచ్చు
- ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేష్ జోస్యం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సీనియర్ నేత, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రేష్ కుమార్ పాకిస్థాన్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2025 తర్వాత పాకిస్థాన్.. భారత్ లో అంతర్భాగంగా మారిపోతుందని జోస్యం చెప్పారు. ముంబయిలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరికొన్నేళ్ల తర్వాత పాకిస్థాన్ అనే దేశం ఉండకపోవచ్చని... కరాచీ, లాహోర్ వంటి నగరాల్లో మనవాళ్లు భూములు కొనుక్కోవచ్చు, లేకపోతే అక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు అన్నారు.
"1947కి ముందు పాకిస్థాన్ అనేది లేదు. అప్పటివరకు అది హిందూస్థాన్ లో ఉండేదని ప్రజలు చెబుతుంటారు. మళ్లీ 2025 తర్వాత పాకిస్థాన్ హిందూస్థాన్ లో భాగమవుతుంది" అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, నసీరుద్దీన్ అన్సారీ, నవజ్యోత్ సిద్ధూ లాంటి దేశద్రోహులను కఠినంగా శిక్షించాలని పిలుపునిచ్చారు. దేశద్రోహులు జేఎన్ యూలో ఉన్నా సరే, మహారాష్ట్రలో ఉన్నా సరే శిక్ష పడేలా కొత్త చట్టం తీసుకురావాలని ఇంద్రేష్ కుమార్ కోరారు.