Andhra Pradesh: నా ఆవును ‘ఎద్దు’ అన్న గాడిదలు ఎవరు?.. మండిపడ్డ కృష్ణా జిల్లా రైతు వెంకటేశ్వరరావు!
- ఇలాంటి ప్రయత్నాలు ఎంతమాత్రం సరికాదు
- నా ఆవునే టీడీపీ ప్రకటనలో వాడారు
- తమది కృష్ణా జిల్లా కంకిపాడు మండలమని వ్యాఖ్య
టీడీపీ పార్టీ కోసం ‘పసుపు కుంకుమ’ పథకం కోసం రూపొందించిన ప్రకటన వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటనలో ఆవుకు బదులుగా ఎద్దును వాడారని వైసీపీ, బీజేపీ మద్దతుదారులతో పాటు నెటిజన్లు సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలో సదరు ప్రకటనలో వాడింది గోమాతేనని కృష్ణా జిల్లాకు చెందిన రైతు మండవ వెంకటేశ్వరరావు తెలిపారు. తన ఆవు, దూడను ఈ ప్రకటన కోసం ఇచ్చానని ఆయన చెప్పారు.
తమది కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామమని పేర్కొన్నారు. టీడీపీ ప్రకటనలో తన ఆవును ఎద్దు అని చెబుతున్న గాడిదలు ఎవరని ప్రశ్నించారు. ఇలాంటి ప్రయత్నాలు చేయడం ఎంతమాత్రం భావ్యం కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పసుపు కుంకుమ పథకం కింద మహిళలకు ఆవులను, నగదును అందజేస్తున్నారని గుర్తుచేశారు.
మరోవైపు టీడీపీ మద్దతుదారులు సైతం ఆవుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆవుకు బొడ్డు, పొదుగు.. రెండూ ఉంటాయని చెబుతున్నారు. కొందరు కావాలని ఒకే యాంగిల్ లో ఫొటోలు తీసి దుష్ప్రచారం చేశారని మండిపడుతున్నారు.