India: పరస్పరం క్షిపణులు ఎక్కుపెట్టుకున్న భారత్, పాకిస్థాన్... మధ్యలో జోక్యం చేసుకున్నది ఎవరు?
- 6 మిస్సైళ్లతో ఇస్లామాబాద్ పనిపడతామన్న భారత్
- 3 రెట్లు ప్రతిదాడులు ఉంటాయని పాక్ జవాబు
- అజిత్ ధోవల్ కు ఫోన్ చేసి సర్దిచెప్పిన బోల్టన్
ఇప్పటివరకు బయటి ప్రపంచానికి తెలిసింది పుల్వామా దాడి, దాని తర్వాత బాలాకోట్ సర్జికల్ స్ట్రయిక్స్, ఆపై భారత్, పాకిస్థాన్ ఫైటర్ జెట్ల పరస్పర దాడులు, అభినందన్ వ్యవహారం మాత్రమే. కానీ, బాలాకోట్ సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత భారత్, పాకిస్థాన్ యుద్ధానికి అత్యంత సమీపంలో నిలిచాయన్న సంగతి ఇప్పుడే బయటపడింది. ఈ క్రమంలో భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా పాక్ ఐఎస్ఐ చీఫ్ అసీమ్ మునీర్ తో ఘాటైన పదజాలంతో సంభాషించారు. తీవ్రవాద వ్యతిరేక దాడులపై భారత్ ఎప్పుడూ వెనుకంజ వేయబోదని, బాలాకోట్ దాడులు మరిన్ని జరుగుతాయని స్పష్టం చేశారు. అయితే, భారత్ వైపునుంచి వచ్చినట్టుగా చెబుతున్న ఓ హెచ్చరిక పాక్ వర్గాలను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది.
సరిగ్గా 6 క్షిపణులతో ఇస్లామాబాద్ ను నామరూపాల్లేకుండా చేస్తామని భారత్ హెచ్చరించగా, అందుకు 3 రెట్లు దాడులతో సమాధానం ఇస్తామంటూ తాము బదులిచ్చినట్టు పాకిస్థాన్ మంత్రి, ఓ సీనియర్ దౌత్యవేత్త ధృవీకరించారు. అయితే, భారత్ నుంచి ఎవరు ఆ హెచ్చరిక చేశారన్నది బయటికి రాలేదు. అయితే, ఈ హెచ్చరికల పర్వం నడుస్తున్న తరుణంలోనే నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తో వియత్నాంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందిన సమాచారంతో ట్రంప్ వెంటనే యూఎస్ జాతీయ భద్రత సలహాదారు బోల్టన్ ను రంగంలోకి దింపి భారత్, పాక్ వర్గాలను శాంతింపజేసినట్టు సమాచారం.
అంతర్జాతీయ పరిణామాలపై ఎంతో అవగాహన ఉన్న బోల్టన్ వెంటనే అజిత్ ధోవల్ కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించి యుద్ధంపై తొందరపాటు వద్దని హితవు పలికారు. ఆ తర్వాత అమెరికా మంత్రి మైక పాంపియో కూడా భారత్, పాక్ వర్గాలతో మాట్లాడి పెను ప్రమాదాన్ని తప్పించారు. ఇటు భారత్ కానీ, అటు పాకిస్థాన్ కానీ ఒక్క క్షిపణిని ప్రయోగించినా ఆ మరుక్షణమే యుద్ధం మొదలయ్యేది. సకాలంలో అగ్రరాజ్యం అమెరికా జోక్యంతో తీవ్ర సంక్షోభం సమసిపోయిందని ఢిల్లీలో ఓ విదేశీ రాయబారి, మరో భారత అధికారి వెల్లడించారు.