Telangana: కాంగ్రెస్ నుంచి మరో వికెట్ ఔట్.. నేడు టీఆర్ఎస్ లో చేరనున్న ఆరేపల్లి మోహన్!
- పెద్దపల్లి సభలో కేసీఆర్ సమక్షంలో చేరిక
- చంద్రశేఖర్ కు పెద్దపల్లి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్
- మనస్తాపంతో పార్టీని వీడుతున్న నేత
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇటీవల ఏదీ కలిసిరావడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి పేరుతో ముందుకెళ్లి ఘోర పరాభవం మూటగట్టుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్రనిరాశలో కూరుకుపోయాయి. ఇప్పటికే రేగ కాంతారావు, ఆత్రం సక్కు, సబితా ఇంద్రారెడ్డి, చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా కరీంనగర్ జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు. లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి సీటును తనకు కేటాయించకపోవడంపై మనస్తాపం చెందిన మోహన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయంలో పలువురు టీఆర్ఎస్ మంత్రులతో మాట్లాడిన మోహన్.. కరీంనగర్ లోక్ సభ సభ్యుడు వినోద్ కుమార్ తో ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. టీఆర్ఎస్ లోకి తాను బేషరతుగా వస్తానని మోహన్ చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంగీకరించారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
ఈ నేపథ్యంలో ఈరోజు పెద్దపల్లిలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో మోహన్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఎస్సీ రిజర్వడ్ స్థానమైన పెద్దపల్లి టికెట్ ను కాంగ్రెస్ అధిష్ఠానం వికారాబాద్‌కు చెందిన మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్‌కు ఇచ్చింది. క్షేత్రస్థాయిలో ఎలాంటి పట్టు లేకపోయినా కేవలం పీసీసీ పరిచయాలతో చంద్రశేఖర్ టికెట్ దక్కించుకోవడంపై రగిలిపోయిన మోహన్.. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు.