Congress: మోదీ ఓ నియంత... హిట్లర్ కేమీ తీసిపోడు: దిగ్విజయ్ సింగ్
- రాజ్యాంగం ప్రమాదంలో పడింది
- రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది
- బీజేపీపైనా వాగ్బాణాలు సంధించిన కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ వృద్ధ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీపైనా, బీజేపీపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. మోదీ కూడా ప్రపంచప్రసిద్ధి చెందిన నియంతలు అడాల్ఫ్ హిట్లర్, బెనిటో ముస్సోలిని కోవలోకే వస్తాడని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకత్వం దేశంలో నియంతృత్వ పోకడలను పెంచిపోషిస్తోందని దిగ్విజయ్ ఆరోపించారు.
కొన్నాళ్ల కిందట సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే కూడా ఇదే తరహాలో మోదీపై వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో హిట్లర్ జర్మనీ దేశాన్ని ఎలా తయారుచేశాడో ఇప్పుడు మోదీ కూడా భారత్ ను అలాగే తయారుచేస్తున్నారని మండిపడ్డారు. భారత రాజ్యాంగ వ్యవస్థలు పెనుప్రమాదంలో పడ్డాయని, బీజేపీ వాటిని నాశనం చేయకుండా కాపాడుకునేందుకు పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. అయితే, బీజేపీ నేత, ప్రస్తుత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గతంలో ఇందిరాగాంధీని హిట్లర్ తో పోల్చుతూ వ్యాఖ్యలు చేశారు. అందుకు ప్రతిగా అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మోదీని ప్రపంచ నియంతలతో పోల్చుతూ విమర్శలు చేస్తున్నారు.