Pakistan: పుల్వామా దాడిపై సంతోషం వ్యక్తం చేస్తూ మోదీకి ఫిట్ నెస్ చాలెంజ్ విసిరిన మసూద్ అజహర్
- మళ్లీ తెరపైకి వచ్చిన ఉగ్రనేత
- అదిల్ దార్ పై ప్రశంసలు
- కశ్మీర్లో జైషే పనితీరుకు మెచ్చుకోలు
బాలాకోట్ సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత పత్తా లేకుండా పోయిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్ మళ్లీ తెరపైకి వచ్చాడు. ఇటీవల మసూద్ కిడ్నీవ్యాధితో బాధపడుతున్నాడని, చికిత్స పొందుతూ మరణించాడని వార్తలొచ్చాయి. అయితే, తాజాగా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన అల్ ఖలామ్ అనే పత్రికలో 'సాదీ' అనే తన కలం పేరుతో ఓ వ్యాసం రాశాడు మసూద్ అజర్.
తాను బతికే ఉన్నానని, ఆరోగ్యంగానే ఉన్నానని తన వ్యాసంలో పేర్కొన్నాడు. తన మృతిపై వస్తున్న వార్తలు అవాస్తవాలని తెలిపాడు. ఇక, పుల్వామా ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోవడం పట్ల ఈ కరుడుగట్టిన ఉగ్రనేత సంతోషం వ్యక్తం చేశాడు. అదిల్ దార్ రగిల్చిన ఈ జ్వాల ఎన్నటికీ ఆరిపోదని, ఎవరూ ఆర్పలేరని గొప్పగా చెప్పాడు. కశ్మీర్ లో జైషే మహ్మద్ పనితీరుకు అదిల్ దార్ ఆత్మాహుతి దాడే నిదర్శనమని పేర్కొన్నాడు.
బాలాకోట్ దాడుల్లో జైషే మహ్మద్ కు తీవ్ర నష్టం వాటిల్లిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నాడు. అంతేకాదు, మోదీకి సవాల్ కూడా విసిరాడీ ఉగ్రనేత. "నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా కిడ్నీలు, కాలేయం పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి. ఏదైనా ఆటలో కానీ, విలువిద్యలో కానీ, షూటింగ్ కాంపిటీషన్ లో కానీ మోదీ నాతో పోటీపడితే ఆయన కంటే నేనే ఫిట్ అని నిరూపించుకోగలను" అంటూ మసూద్ అజర్ ప్రగల్భాలు పలికాడు.