Naresh: ‘మా’లో అవకతవకలు జరగడం వాస్తవం.. శివాజీరాజా ఫోన్ చేసి బెదిరిస్తున్నారు: నరేశ్
- మమ్మల్ని వెనక్కి లాగుతున్నారు
- ఈనెల 23న ప్రమాణ స్వీకారం
- శివాజీ రాజా అడ్డుకుంటున్నారు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో నరేశ్ ప్యానెల్ విజయం సాధించింది. అయితే నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే.. ‘మా’లో అంతర్గత పోరు బయట పడుతోంది. ‘మా’ ఎన్నికల్లో నరేశ్‌కి ప్రత్యర్థిగా నిలిచిన శివాజీ రాజా తమను ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకుంటున్నారని నరేశ్ ఆరోపిస్తున్నారు. నేడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కృష్ణమోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నరేశ్, రాజశేఖర్, జీవిత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ.. ‘మా’లో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవమని.. అయితే ‘మా’ గుట్టు బయటపడకుండా అందరినీ కలుపుకుపోయి పని చేయాలని తాను నిర్ణయించుకున్నట్టు నరేశ్ తెలిపారు. కానీ పని చేసుకోనీయకుండా తమను వెనక్కి లాగుతున్నారని వాపోయారు.
పరిశ్రమలోని పెద్దల సలహా మేరకు ఈ నెల 22న ప్రమాణ స్వీకారానికి ముహూర్తం నిర్ణయించుకున్నామని తెలిపారు. కానీ శివాజీరాజా తన పదవీ కాలం 31 వరకూ ఉందని.. అప్పటి వరకూ ‘మా’ కుర్చీలో కూర్చోవడానికి వీల్లేదంటున్నారని నరేశ్ పేర్కొన్నారు. ఒకవేళ అలా కూర్చుంటే కోర్టుకు వెళతామని ఫోన్ చేసి బెదిరిస్తున్నారని వాపోయారు. తాము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అలా అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. పెద్దలు ఎలా చెబితే అలా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని నరేశ్ తెలిపారు.