loksabha: లోక్ సభ ఎన్నికలు.. తెలంగాణలో బయోడేటాలు స్వీకరించనున్న ‘జనసేన’
- రేపటి నుంచి ప్రారంభం
- మాదాపూర్ లోని పార్టీ కార్యాలయంలో సమర్పించాలి
- 3 రోజుల పాటు బయోడేటాలు స్వీకరిస్తాం: జనసేన పార్టీ
తెలంగాణలో లోక్ సభ స్థానాల నుంచి పోటీకి బయోడేటాల స్వీకరణ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. హైదరాబాద్, మాదాపూర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటల నుంచి ఆశావహులు తమ బయో డేటాలు అందజేయాలని పేర్కొంది. మూడు రోజుల పాటు ఆశావహుల బయోడేటాలను స్వీకరిస్తామని తెలిపింది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని లోక్ సభ స్థానాల నుంచి జనసేన పక్షాన బలమైన అభ్యర్థులను పోటీలో నిలిపేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నియమించినట్టు తెలిపింది. ఈ కమిటీ సభ్యులుగా నేమూరి శంకర్ గౌడ్, అర్హం ఖాన్ ఉన్నట్టు వివరించింది. జనసేన పార్టీ మూల సిద్ధాంతాలు, పార్టీ విధానాలపై విశ్వాసం ఉన్న సేవాతత్పరులు, జన సైనికులు తమ బయోడేటాలను ఈ కమిటీకి సమర్పించాలని కోరింది.