USA: వీసాల కోసం నకిలీ పెళ్లిళ్లు జరిపిస్తున్న తెలుగువ్యక్తికి అమెరికాలో అరదండాలు

  • 80 ఉత్తుత్తి పెళ్లిళ్లు జరిపించిన రవిబాబు కొల్లా
  • అధికారుల విచారణలో వాస్తవాల వెల్లడి
  • ఓ అమెరికా మహిళకూ తప్పని జైలుశిక్ష

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక భారతీయులు గతంలో మాదిరిగా అగ్రరాజ్యంలో స్వేచ్ఛగా అడుగుపెట్టే వీల్లేకుండా పోయింది. భారతీయులనే కాదు ఇతర దేశస్తులు తమ దేశంలో అప్పనంగా ఉండిపోవడం కుదరదంటూ ట్రంప్ కఠిన ఆంక్షలు విధించారు. దాంతో, అమెరికాలో స్థిరపడాలని కోరుకునేవాళ్లు కొందరు పక్కదారులు వెదకడం మొదలుపెట్టారు. అలాంటివాళ్ల అవసరాన్ని సొమ్ము చేసుకుంటూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు రవిబాబు కొల్లా అనే తెలుగువ్యక్తి.

రవిబాబు అమెరికాలో స్థిరపడాలని కోరుకునే భారతీయులకు నకిలీ వివాహాలు జరిపించి, వారికి వీసా వచ్చేలా చూసేవాడు. 47 ఏళ్ల రవిబాబు ఈ విధంగా ఇప్పటివరకు 80 ఉత్తుత్తి పెళ్లిళ్లు జరిపించినట్టు అమెరికా పోలీసుల విచారణలో తేలింది. రవిబాబు కొల్లా ఫ్లోరిడాలోని పనామా సిటీలో నివాసం ఉంటున్నాడు. అతనికి ఈ నకిలీ పెళ్లిళ్ల దందాలో అమెరికా పౌరురాలు క్రిస్టల్ క్లౌడ్ సహకరించేది.

2017 ఫిబ్రవరి నుంచి 2018 ఆగస్ట్ మధ్యలో బే కౌంటీలో అనేకమంది అమెరికన్లను తన నకిలీ మ్యారేజ్ రాకెట్లో భాగం చేశాడు. తన వద్దకు వచ్చే ఇండియన్లకు ఆ అమెరికన్లతో పెళ్లి చేసి వాళ్లకు అమెరికా పౌరసత్వం వచ్చేలా ఏర్పాట్లు చేసేవాడు. అందుకోసం భారీగా డబ్బు వసూలుచేసేవాడు రవిబాబు. అతని వ్యవహారంపై అనుమానం వచ్చిన అధికారులు అరెస్ట్ చేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపారు. అతనికి సహకరించిన క్రిస్టల్ క్లౌడ్ కు ఇప్పటికే రెండేళ్ల జైలుశిక్ష విధించారు. రవిబాబు వ్యవహారంలో మనీలాండరింగ్ అంశం కూడా ఉండడంతో అతని విషయంలో మే 22న తుది తీర్పు రానుంది.

USA
  • Loading...

More Telugu News