Nellore District: నెల్లూరు టీడీపీ అభ్యర్థి ఆదాల కంపెనీ ఖాతాలోకి రూ. 43 కోట్లు.. ఆ వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిన నేత.. కలవరంలో టీడీపీ!

  • 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లుల క్లియరెన్స్
  • రూ. 43 కోట్లు ఖాతాలో పడగానే ఆదాల మాయం
  • త్వరలో వైసీపీలో చేరిక అంటూ ప్రచారం

నెల్లూరు రూరల్ స్థానం నుంచి పోటీకి టికెట్ సంపాదించుకున్న మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నపళంగా అజ్ఞాతంలోకి వెళ్లడం వెనక పెద్ద కథే నడిచిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన అదృశ్యం తర్వాత ఆయనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. టీడీపీ టికెట్ కేటాయించినప్పటికీ వైసీపీలో చేరి నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అదృశ్యమైనట్టు అనుమానిస్తున్నారు.

ఆదాల అదృశ్యం వెనక మరో కోణం కూడా ఉందన్న వార్తలు తాజాగా బయటకొచ్చాయి. 15 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆదాల క్లియర్ చేయించుకున్నారని, దాదాపు రూ. 43 కోట్ల బిల్లులకు క్లియర్ అయినట్టు సమాచారం. గురువారం అర్ధరాత్రి వరకు అమరావతిలోనే ఉన్న ఆదాల ఆ తర్వాత నెల్లూరు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పెండింగ్ బిల్లులకు సంబంధించి రూ. 43 కోట్లు ఆయన కంపెనీ ఖాతాలో జమ అయినట్టు ఆయన మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. అంతే.. ఆ వెంటనే ప్రచారాన్ని ముగించిన ఆదాల అమరావతికి రమ్మంటున్నారంటూ అక్కడి నుంచి బయలుదేరి అదృశ్యమయ్యారు.

ప్రభాకర్ రెడ్డి అదృశ్యం వార్తతో ఉలిక్కిపడిన టీడీపీ నేతలు ఆయనను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు, ఆయన ఇంటి వద్ద ఉన్న టీడీపీ ప్లెక్సీలను ఆయన అనుచరులు తొలగించడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఆదాల వైసీపీలో చేరబోతున్నట్టు ప్రచారం ఊపందుకుంది.

Nellore District
Adala prabhakar reddy
Telugudesam
YSRCP
Andhra Pradesh
Chandrababu
  • Loading...

More Telugu News