SBI: ఇక కార్డు లేకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. ‘యోనో క్యాష్’ను తీసుకొచ్చిన ఎస్‌బీఐ!
- యోనో క్యాష్ పాయింట్‌ల ఏర్పాటు
- పిన్ నంబరు సెట్ చేసుకోవడం ద్వారా నగదు ఉపసంహరణ అవకాశం
- దేశవ్యాప్తంగా అందుబాటులోకి 16,500కుపైగా ఏటీఎంలు
భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఎస్‌బీఐ డిజిటల్ ప్లాట్‌ఫాం యోనోపై కొత్తగా ‘యోనో క్యాష్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్యాష్‌తో దేశవ్యాప్తంగా 16,500కుపైగా ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్లలో కార్డు అవసరం లేకుండానే క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఇటువంటి పద్ధతిని ప్రవేశపెట్టిన దేశంలోనే తొలి సంస్థగా ఎస్‌బీఐ అవతరించింది.
యోనో క్యాష్ సదుపాయం ఉన్న ఏటీఎంలను ‘యోనో క్యాష్ పాయింట్’గా వ్యవహరించనున్నారు. వినియోగదారులు ఈ పాయింట్‌లోకి వెళ్లిన తర్వాత కార్డు రహిత విత్‌డ్రాను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆరు అంకెల యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి. అనంతరం ఖాతాదారుడి మొబైల్‌కు ఎస్సెమ్మెస్ ద్వారా వచ్చిన ఆరు అంకెల రిఫరెన్స్ నంబరును ఎంటర్ చేయడం ద్వారా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, ఈ పని 30 నిమిషాల్లోగా పూర్తిచేయాల్సి ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది.