Jagan: మా చిన్నాన్నను చంపింది డ్రైవర్ అంటూ రక్తంతో లేఖ పుట్టించారు: జగన్ ఆగ్రహం​

  • సీబీఐ విచారణ జరిపించాల్సిందే
  • మా తాత హత్య నుంచే కుట్రమొదలైంది
  • చంద్రబాబుపై ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ అధినేత

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం పులివెందుల చేరుకున్న జగన్... వివేకా భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబునాయుడుపై విరుచుకుపడ్డారు. తన చిన్నాన్నను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని ఆరోపించిన జగన్... ఈ క్రమంలో భారీ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు.

"మా చిన్నాన్నను చంపి ఆయనే ప్రమాదవశాత్తు చనిపోయినట్టు నమ్మించాలని ప్రయత్నాలు జరిగాయి. రక్తం కక్కుకుని పడిపోయినట్టు నమ్మించాలని, బాత్రూంలో కమోడ్ గుద్దుకుని ప్రాణాలు వదిలినట్టు చిత్రీకరించాలని ప్రయత్నించారు. అంతేకాదు, ఆయన హత్యా నేరాన్ని మరొకరిపై నెట్టేందుకు, ఈ విషయంలో పూర్తి అయోమయాన్ని సృష్టించేందుకు ప్రణాళిక ప్రకారం వ్యవహరించారు.

మా చిన్నాన్న రక్తంతో లేఖ రాసినట్టు సంఘటన స్థలంలో ఓ లేఖను పుట్టించారు. ఆ లేఖలో డ్రైవర్ పేరు పెట్టి అతడే తన మరణానికి కారణమని అనుమానాలు వచ్చేలా కుట్ర పన్నారు. డ్రైవర్ మీద నేరం మోపుతున్నట్టు ఆ లేఖలో రాసింది హంతకులే. మా చిన్నాన్న చావుబతుకుల్లో ఉండి ఆ లేఖ రాశాడా? హంతకులు చూస్తుండగానే తన రక్తంతోనే తాను లేఖ రాశాడా? దీని వెనుక ఉన్న కుట్ర ఏంటో తేలాలి!

ఈ రాష్ట్ర పోలీసులపై మాకు నమ్మకం లేదు. సీబీఐ విచారణ జరిపించాల్సిందే. అంతెందుకు, నేను కడప ఎస్పీతో మాట్లాడుతుండగానే అతడికి అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావు నుంచి వరుసగా ఫోన్లు వస్తున్నాయి. ఆ నంబర్ ఎవరిదో కనిపిస్తూనే ఉంది. ఒక ప్లాన్ ప్రకారం జరిగిన ఈ హత్యలో మూలాలు ఎక్కడున్నాయో అన్వేషించాలి. మా తాత రాజారెడ్డి హత్యనుంచే ఈ కుట్రలు మొదలయ్యాయి. మొదట మా తాతను చంపారు, ఆ తర్వాత మా నాన్నను చంపారు. అప్పుడు సీబీఐ తరఫున లక్ష్మీనారాయణే విచారణ జరిపారు. ఆపై నా మీద వైజాగ్ ఎయిర్ పోర్టులో హత్యాయత్నం చేశారు. టీడీపీ లింకులున్న వ్యక్తులే ఈ దాడిలో ఉన్నారు.

మా తాత హత్య జరిగినప్పుడూ చంద్రబాబే సీఎంగా ఉన్నారు. నాపై హత్యాయత్నం జరిగినప్పుడు, ఇప్పుడు మా చిన్నాన్న హత్యకు గురైనప్పుడూ చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతెందుకు, మా నాన్న చనిపోవడానికి రెండ్రోజుల ముందు చంద్రబాబు అసెంబ్లీలో సవాల్ చేశారు. మళ్లీ అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని అన్నారు. అదే క్లిప్పింగ్ ను ఓ పేపర్ ప్రముఖంగా ప్రచురించింది. ఆ తర్వాత మా నాన్న విషాదకర పరిస్థితుల్లో హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యారు.

 ఈ సంఘటనల మధ్య సంబంధం ఏంటో తెలియాలంటే సీబీఐ విచారణ తప్పనిసరి. చంద్రబాబుకు రిపోర్ట్ చేయని వ్యవస్థతోనే విచారణ జరిపించినప్పుడే నిజాలు బయటికి వస్తాయి. దేవుడిపై నాకు నమ్మకం ఉంది, అన్యాయం చేసినవాళ్లను ఆయన తప్పక శిక్షిస్తాడు. ఈ ఘటనకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు ఎటువంటి ఆందోళనలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను" అంటూ ప్రెస్ మీట్ ముగించారు జగన్.

  • Loading...

More Telugu News