Nara Lokesh: నాకు పీఏ ఉండడు... ఎవరికైనా నేనే ఫోన్ చేస్తాను: నారా లోకేశ్
- అందరి మెసేజ్ లకు, కాల్స్ కు నేనే సమాధానమిస్తా
- కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా
- మంగళగిరి ప్రజలకు ఏపీ మంత్రి స్పష్టీకరణ
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న నారా లోకేశ్ తన నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిన లోకేశ్ తాజాగా మంగళగిరిలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పీఏ అంటూ ఎవరూ ఉండరని, ఎవరు ఫోన్ కాల్ చేసినా, ఎవరు మెసేజ్ పంపినా స్వయంగా తానే మాట్లాడడమో లేక సందేశం పంపడమో చేస్తానని వెల్లడించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేందుకు తాను ఇష్టపడతానని స్పష్టం చేశారు.
పీఏ వ్యవస్థ కారణంగా అటు నేతకు ఇటు ప్రజలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడే అవకాశముందన్నది నారా లోకేశ్ అభిప్రాయంగా తెలుస్తోంది. అంతేగాకుండా, కొందరు నాయకులు తాను పోటీచేస్తున్న నియోజకవర్గంలో కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నారంటూ పరోక్షంగా తన ప్రత్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై విమర్శలు చేశారు. ఇవాళ కులం అంటారు, రేపు మతాన్నో, ప్రాంతాన్నో తీసుకువస్తారంటూ వ్యాఖ్యానించారు. తనకు ఇక నుంచి కులం అయినా, మతం అయినా, ప్రాంతం అయినా 'అంతా మంగళగిరే' అని ఉద్ఘాటించారు ఏపీ మంత్రి.