India: పంజాబ్ లో పాకిస్థాన్ గూఢచారి అరెస్ట్.. భారత ఆర్మీ రహస్యాలు పాక్ చేతిలోకి!
- ఐఎస్ఐకి సమాచారం చేరవేస్తున్న రాజ్ కుమార్
- ప్రతిగా డబ్బులు ఇస్తున్న పాకిస్థానీ నిఘావర్గాలు
- వాట్సాప్ ద్వారా సమాచారం చేరవేత
భారత ఆర్మీకి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ కు చేరవేస్తున్న ఓ గూఢచారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ లోని జలంధర్ కు చెందిన రాజ్ కుమార్ స్థానికంగా ఉండే ఆర్మీ స్థావరాల వివరాలతో పాటు సైనికుల కదలికలపై పూర్తి సమాచారాన్ని పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కు చేరవేస్తున్నట్లు భారత నిఘావర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ స్పెషల్ ఆపరేషన్స్ విభాగానికి చెందిన పోలీసులు రాజ్ కుమార్ ను అరెస్ట్ చేశారు.
ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. రాజ్ కుమార్ నుంచి రెండు ఫోన్లు, నాలుగు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఆర్మీ పోస్టుల వివరాలను నిందితుడు ఐఎస్ఐ వర్గాలకు అందజేస్తున్నట్లు గుర్తించామన్నారు. వాట్సాప్ ద్వారా రాజ్ కుమార్ ఐఎస్ఐ ఏజెంట్ కు సమాచారం పంపేవాడనీ, ఇందుకు ప్రతిగా నగదును అందుకునేవాడని పేర్కొన్నారు.
తాను నేరం చేసినట్లు రాజ్ కుమార్ అంగీకరించాడని అన్నారు. అంతేకాకుండా స్థానికంగా సిమ్ కార్డులను కొనుగోలుచేసిన రాజ్ కుమార్ పాకిస్థానీ ఐఎస్ఐ హ్యాండ్లర్లకు అందించాడని విచారణలో తేలిందన్నారు. నిందితుడిపై అధికారిక రహస్యాల చట్టం-1920, ఐపీపీ 120బీ కింద కేసు నమోదు చేశామని తెలిపారు.