mosques: న్యూజిలాండ్‌లో కాల్పులు.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు
- క్రైస్ట్‌చర్చ్ మసీదులో కాల్పులు
- ఆ సమయంలో అక్కడే ఉన్న బంగ్లాదేశ్ జట్టు
- వణికిపోయిన ఆటగాళ్లు.. హోటల్‌కు తరలించిన యాజమాన్యం
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. క్రైస్ట్‌చర్చ్‌లోని ఓ మసీదును సందర్శించిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు లోపలికి వెళ్తుండగా కాల్పుల మోతతో మసీదు హోరెత్తింది. దీంతో భయభ్రాంతులకు గురైన ఆటగాళ్లు అక్కడి నుంచి పరుగులు తీశారు. కాగా, కాల్పుల ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆటగాళ్లు క్షేమంగా ఉన్నారని, అయితే, మానసికంగా కొంత షాక్‌కు గురయ్యారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికార ప్రతినిధి జలాల్ యూనస్ తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఆటగాళ్లను హోటల్ రూములకు తరలించామని, పరిస్థితులు చక్కబడే వరకు హోటల్‌కే పరిమితం కావాలని కోరినట్టు చెప్పారు.
ఈ ఘటనపై బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ట్వీట్ చేస్తూ.. కాల్పుల నుంచి జట్టు సభ్యులందరం క్షేమంగా బయటపడినట్టు చెప్పాడు. ఈ ఘటనతో వణికిపోయామని, తమకోసం ప్రార్థనలు చేస్తుండాలని ట్వీట్ చేశాడు. మరో ఆటగాడు ముష్పికర్ రహీం ట్వీట్ చేస్తూ.. తమను అల్లానే రక్షించాడని పేర్కొన్నాడు. తాము చాలా అదృష్టవంతులమని, ఇటువంటి ఘటనను మరోమారు చూడాలనుకోవడం లేదని పేర్కొన్నాడు. కాగా, కాల్పుల ఘటనలో పలువురు చనిపోయి ఉండొచ్చని స్థానిక మీడియా పేర్కొంది. ప్రార్థనల కోసం మసీదుకు వచ్చిన వారిపై విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.