Andhra Pradesh: రాయపాటి గారూ.. తొందరపడొద్దు..!: టీడీపీ నేతకు ఏపీ మంత్రి నారా లోకేశ్ ఫోన్
- పార్టీని వీడొద్దనీ, అండగా ఉంటామని హామీ
- రంగంలోకి దిగిన లగడపాటి, సుజనా చౌదరి
- రాయపాటి ఏం చేస్తారోనని రాజకీయవర్గాల్లో ఆసక్తి
నరసరావుపేట లోక్ సభ, సత్తెనపల్లి అసెంబ్లీ స్థానాల విషయంలో టీడీపీ అధిష్ఠానంపై ఆ పార్టీ నేత రాయపాటి సాంబశివరావు అలకబూనిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత చంద్రబాబు నుంచి ఈ విషయంలో ఎలాంటి హమీ రాకపోవడంతో ఈరోజు సాయంత్రం తన కార్యాచరణను చెబుతానని రాయపాటి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ నష్టనివారణ చర్యలకు దిగారు.
రాయపాటి సాంబశివరావుకు ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేసిన లోకేశ్ ‘రాయపాటి గారూ.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పార్టీ మీకు అన్నివిధాలుగా అండగా ఉంటుంది’ అని హామీ ఇచ్చారు. అనంతరం రాయపాటిని బుజ్జగించేందుకు టీడీపీ నేత సుజనాచౌదరితో పాటు లోక్ సభ మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ను ఆయన ఇంటికి పంపారు.
ఈ నేపథ్యంలో రాయపాటి వెనక్కు తగ్గి టీడీపీలోనే కొనసాగుతారా? లేక వైసీపీలో చేరుతారా? అన్న విషయమై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాగా, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు కేటాయించిన సత్తెనపల్లి టికెట్ తన కుమారుడికి ఇవ్వాలని రాయపాటి చంద్రబాబును కోరుతున్నట్లు సమాచారం.