Andhra Pradesh: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై రామ్ గోపాల్ వర్మ సర్వే.. ఏపీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్న 72 శాతం నెటిజన్లు!
- ఫేస్ బుక్ లో సర్వే నిర్వహించిన వర్మ
- ప్రభావం చూపబోదన్న 28 శాతం మంది నెటిజన్లు
- సినిమా రిలీజ్ ఆపేయాలని ఈసీకి టీడీపీ ఫిర్యాదు
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవితంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఈ నెల 22న విడుదల చేసుకునేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫేస్ బుక్ లో ఓ సర్వేను నిర్వహించారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందా? అని ప్రశ్నించారు. ఈ పోలింగ్ లో 35,700 మంది పాల్గొన్నారు.
ఇందులో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందని 72 శాతం అంగీకరించగా, ఎలాంటి ఫలితం చూపబోదని 28 శాతం మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబును నెగటివ్ గా చూపిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను నిలిపివేయాలని టీడీపీ కార్యకర్త దేవిబాబు చౌదరి ఎన్నికల కమిషన్‌కు నిన్న ఫిర్యాదు చేశారు. తొలివిడత పోలింగ్ ముగిసేవరకూ సినిమా విడుదలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.