USA: అమెరికాను వణికిస్తున్న సైక్లోన్ 'బాంబ్'... 1,339 విమానాలు రద్దు!
- డెన్వర్ రాష్ట్రం అతలాకుతలం
- ఆఫీసులు, స్కూళ్లు మూసివేత
- 110 రోడ్డు ప్రమాదాలు
అమెరికాను 'బాంబ్' తుపాను వణికిస్తోంది. ముఖ్యంగా డెన్వర్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయగా, 1,339 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. కొలరాడో, వోమ్నింగ్, నెబ్రాస్కా, డకోటా రాష్ట్రాల్లోనూ భారీగా మంచు వర్షం పడుతోంది. ప్రజలు ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికారులు హెచ్చరించారు.
గడచిన 24 గంటల వ్యవధిలో 23 మిల్లీబార్ల ఒత్తిడితో మంచు కురిసిందని డెన్వర్ పోలీస్ విభాగం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. దీనిని 'బాంబ్ సైక్లోన్'గా అభివర్ణించింది. రహదారులపై 110 వరకూ రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని ఆరు రన్ వేలపైనా మంచు పేరుకుపోయిందని విమానాశ్రయ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. సుమారు 1.30 లక్షల మంది చీకట్లో మగ్గుతున్నారని ఎక్సెల్ ఎనర్జీ వెల్లడించింది. కరెంట్ సరఫరాలో సమస్యలు ఉన్నచోటికి సిబ్బంది వెళ్లాలంటే కష్టంగా ఉందని ఎక్సెల్ ఎనర్జీ ప్రతినిధి మార్క్ స్టుట్జ్ తెలిపారు.