Congress: కాంగ్రెస్ సరికొత్త వ్యూహం.. మల్కాజిగిరి నుంచి రేవంత్ రెడ్డి బరిలోకి!

  • మహబూబాబాద్ బరిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క
  • జాబితాలో మార్పు చేర్పుల కారణంగానే ఆలస్యం
  • 15 తర్వాత జాబితా విడుదల

తెలంగాణ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పరాభవం పాలైన కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. తనకు తిరుగులేదనుకున్న సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఇటీవల అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. మరోవైపు, తనతోపాటు కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చిన సీతక్క ములుగు నుంచి గెలుపొందారు. ఇప్పుడు వీరిద్దరినీ లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడుతూ.. అధిష్ఠానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి బరిలోకి దిగుతానని రేవంత్ చెప్పుకొచ్చారు. మరోవైపు, ఎన్నికలు ముంచుకొస్తుండడంపై అభ్యర్థుల ఎంపికలో తలమునకలైన కాంగ్రెస్.. మల్కాజిగిరి సీటుకు రేవంత్ రెడ్డిని పరిశీలిస్తున్నట్టు సమాచారం. అలాగే, ములుగు ఎమ్మెల్యే సీతక్కను మహబూబాబాద్ నుంచి బరిలోకి దించాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించాల్సిన కాంగ్రెస్.. అభ్యర్థుల మార్పు కారణంగానే జాబితా విడుదల ఆలస్యమైనట్టు సమాచారం. పూర్తిస్థాయి మార్పు చేర్పుల తర్వాత ఈ నెల 15 తర్వాతే జాబితాను విడుదల చేయనున్నట్టు పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News