America: పెంపుడు కుక్కను రక్షించటం కోసం మంటల్లోకి దూకిన యజమాని.. నెటిజన్లు ఫిదా!
- జోస్ నివాసంలో చెలరేగిన మంటలు
- పెంపుడు కుక్క మంటల్లో ఉందని గ్రహించాడు
- జోస్ ముఖం, చేతికి స్వల్ప గాయాలు
తన ఇంట్లో ఉవ్వెత్తున మంటలు ఎగసిపడుతుంటే హుటాహుటిన అతను బయటకు పరిగెత్తుకొచ్చాడు. తీరా వచ్చాక తన పెంపుడు కుక్క మంటల్లో చిక్కుకుందని గ్రహించాడు. కానీ వెనుకడుగేయలేదు. వెంటనే మంటల్లోకి దూకేసి కుక్కను క్షేమంగా బయటకు తీసుకొచ్చి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాడు. అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న జోస్ అనే వ్యక్తి ఇంట్లో మంటలు చెలరేగాయి. వెంటనే అతను సురక్షితంగా బయటకు రాగలిగాడు. కానీ అతని పెంపుడు కుక్క గబానా మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది.
దీంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇంటి లోపలికి వెళ్లి.. కుక్కను బయటకు తీసుకువచ్చేశాడు. ఈ క్రమంలో జోస్ ముఖం, చేతికి స్వల్ప గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. జోస్ సాహసానికి, మంచి మనసుకి నెటిజన్లు ఫిదా అయిపోయి ప్రశంసలతో ముంచెత్తారు.
దీనిపై జోస్ మాట్లాడుతూ.. తాను ఇంట్లోకి పరిగెత్తడానికి ముందు గబానా తప్ప వేరొకటి గుర్తు రాలేదని, కుక్క మాత్రమే తన దృష్టిలో ఉందన్నారు. మంటలు అలముకోవడంతో తనకేమీ కనిపించలేదని.. కుక్కను మాత్రం ఇంటి నుంచి క్షేమంగా బయటకు తీసుకురాగలిగానన్నారు.