KTR: "సారు, కారు, పదహారు, ఢిల్లీలో సర్కారు"... లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కొత్త స్లోగన్

  • ఎన్నికల నినాదాన్ని విపులీకరించిన కేటీఆర్
  • మోదీపై విమర్శలు
  • బొకేలు తీసుకోవడం తప్ప చేసిందేమీ లేదంటూ ఆక్రోశం

లోక్ సభ ఎన్నికల ముంగిట తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్ సభ ఎన్నికల్లో తమ నినాదాన్ని వెల్లడించారు. "సారు, కారు, పదహారు, ఢిల్లీలో సర్కారు"... ఇదే తమ ఎన్నికల స్లోగన్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ నినాదం గురించి వివరించే క్రమంలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. పలు అభివృద్ధి పనుల కోసం తగినన్ని నిధులు కేటాయించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రధానిలో స్పందనలేదని అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం పలు నీటిపారుదల పథకాల కోసం కేంద్రాన్ని రూ.24,000 కోట్లు అడిగిందని, కానీ ఎలాంటి నిధులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఎన్నికల్లో తాము 16 సీట్లలో గెలిపించాలని కోరుతున్నామంటూ తన వ్యాఖ్యల వెనుక రాజకీయ ప్రయోజనాన్ని ఇమిడ్చారు కేటీఆర్.

టీఆర్ఎస్ ఎంపీలకు తోడు మరో 100 ఎంపీలు ఉంటే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని భవిష్యత్ ప్రణాళికను చూఛాయగా వెల్లడించారు. ప్రధాని తామిచ్చిన బొకేలు తీసుకున్నారు కానీ, తెలంగాణకు ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. బొకేలు తీసుకోవడం, చిరునవ్వుతో వెళ్లిపోవడం... ప్రధాని మోదీ చేసింది ఇంతవరకేనని అన్నారు. అందుకే, 'సారు' (కేసీఆర్)కు చెందిన 'కారు'(టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు)ను గెలిపించి 'పదహారు' (ఎంపీలు) మందిని లోక్ సభకు పంపిస్తే 'ఢిల్లీలో సర్కారు' (కేంద్రం) మనదవుతుందని కేటీఆర్ భాష్యం చెప్పారు.

  • Loading...

More Telugu News