East Godavari District: ఏకాభిప్రాయం కోసం అమరావతికి పిలిస్తే.. కొట్టుకున్న రంపచోడవరం టీడీపీ వర్గాలు

  • ఎమ్మెల్యే వంతల అనుకూల, వ్యతిరేక వర్గాల బాహాబాహీ
  • వివాదాస్పదంగా మారిన అభ్యర్థిత్వం
  • ఆలోచనలో పడిన అధిష్ఠానం

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం టీడీపీ టిక్కెట్టు రచ్చ అమరావతి చేరింది. నియోజకవర్గం టీడీపీ నాయకులు సిట్టింగ్‌ ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోవడంతో ఏకాభిప్రాయ సాధన కోసం వారిని అధిష్ఠానం రాజధానికి పిలిపించింది. అయితే చర్చలు ప్రారంభంకాకముందే ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి.

వివరాల్లోకి వెళితే... రంపచోడవరం టికెట్టును సిట్టింగ్‌ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆశిస్తున్నారు. అయితే, ఆమె వ్యతిరేక వర్గమైన పలువురు మండలాధ్యక్షులు, స్థానిక సంస్థల నాయకులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. స్థానికంగా జరిపిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో ముఖ్యమంత్రికి అనుబంధంగా పనిచేస్తున్న నియోజకవర్గ వివాదాల పరిష్కార కమిటీకి సమస్య పరిష్కార బాధ్యతను చంద్రబాబు అప్పగించారు.

దీంతో వంతల రాజేశ్వరితోపాటు, ఆమె వ్యతిరేక వర్గీయులను నిన్న అమరావతి పిలిపించారు. వీరు అక్కడ పరస్పరం వాదులాటకు దిగారు. ఇరువర్గాలు బలప్రదర్శనకు దిగారు. అనంతరం కొట్లాడుకున్నారు. దీంతో ఆశ్చర్యపోవడం వివాద పరిష్కార కమిటీ వంతయింది. విషయం తెలుసుకున్న చంద్రబాబు సమస్య పరిష్కార బాధ్యతను మళ్లీ కమిటీకే అప్పగించారు.  

ప్రస్తుతం ఈ కమిటీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ఆమె వర్గీయులతోపాటు మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నంబాబూ రమేష్‌, విలీన మండలాల ప్రతినిధి కొమరం ఫణేశ్వరమ్మ, ఇతర ఆశావహులు గొర్లె సునీత, డాక్టర్‌ కోసూరి అప్పారావు, బొగ్గు కాటంరెడ్డి, డాక్టర్‌ కోసూరి సత్యనారాయణదొర, జగన్నాథరెడ్డి, కె.వీరలక్ష్మి, ఇతర ముఖ్య నాయకులతో ముఖాముఖీ సమావేశమై వారి అభిప్రాయాలు సేకరిస్తారు. అనంతరం అధినేతకు నివేదిక అందిస్తే ఆయన నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

  • Loading...

More Telugu News