Indian border: సరిహద్దులో పాక్ గూఢచారి అరెస్టు... ఆర్మీ రహస్యాలు చేరవేస్తున్నట్లు గుర్తింపు
- నిందితుడు రాజస్థాన్ లోని జైసల్మేర్‌కు చెందిన నవాబ్‌ఖాన్
- జీపు డ్రైవర్‌గా పనిచేస్తూ గూఢచర్యం
- నిఘా పెట్టి పట్టుకున్న అధికారులు
జీపు డ్రైవర్‌గా పనిచేస్తూ సరిహద్దులో తిరుగుతున్నప్పుడు సేకరించిన భారత్ ఆర్మీ రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్న గూఢచారిని నిఘా విభాగం అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని రాజస్థాన్ లోని జైసల్మేర్‌కు చెందిన నవాబ్‌ఖాన్‌గా గుర్తించారు. రాజస్థాన్‌లోని ఇండియా-పాకిస్థాన్ బోర్డర్‌లో తిరుగుతూ ఇతను గూఢచర్యానికి పాల్పడుతున్నాడని అనుమానం వచ్చిన ఆర్మీ అధికారులు నిఘా పెట్టారు. తమ అనుమానం నిజం కావడంతో వెంటనే అతడిని అరెస్టు చేసినట్లు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉమేష్ మిశ్రా తెలిపారు.
‘ఇతను ఇండియన్ ఆర్మీ రహస్యాలను సేకరించి వాటిని ఓ కోడ్ భాషలో వాట్సాప్ ద్వారా పాకిస్థాన్ ఆర్మీకి చేరవేస్తున్నాడు. ఖాన్ గత ఏడాది పాకిస్థాన్ సందర్శించాడు. అప్పటి నుంచి అక్కడి ఐఎస్‌ఐతో టచ్‌లో ఉన్నాడు. ఐఎస్‌ఐ ఖాన్‌కు గూఢచర్యంలో శిక్షణ ఇచ్చి, రహస్యాలు ఎలా పంపాలో నేర్పింది' అని మిశ్రా తెలిపారు.