Chandrababu: జగన్ కోరుకుంటున్నది సీఎం సీటు కాదు... ప్రజల మరణశాసనం: చంద్రబాబు నిప్పులు
- డబ్బులు తీసుకుని టికెట్లు ఇస్తున్న వైసీపీ
- ఒక్కో సెగ్మెంట్ కు ఒక్కో రేటు పెట్టారన్న చంద్రబాబు
- జగన్ గెలిస్తే, కేసీఆర్ చెప్పిన చోటల్లా సంతకాలే
- టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబునాయుడు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కోరుకుంటున్నది ముఖ్యమంత్రి పీఠాన్ని కాదని, ఆయన రాష్ట్ర ప్రజల మరణశాసనాన్ని కోరుకుంటున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఈ ఉదయం పార్టీ నాయకులు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, డబ్బులు ఇస్తున్న వారికి మాత్రమే వైసీపీ టికెట్లను ఇస్తోందని ఆరోపించారు. జనరల్ సెగ్మెంట్ కు ఓ రేటు, రిజర్వేషన్ సెగ్మెంట్ కు మరో రేటును జగన్ పెట్టారని, ఈ విషయాన్ని ఆ పార్టీ నుంచి వచ్చిన వారే తనకు చెబుతున్నారని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీకి, తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఊడిగం చేసేందుకు వైఎస్ జగన్ సిద్ధం అయ్యారని, జగన్ గెలిస్తే, అభివృద్ధి కుంటుపడిపోతుందని, ప్రజలకు సంక్షేమం దూరమవుతుందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే, కేసీఆర్ చెప్పిన చోటల్లా జగన్ సంతకాలు పెట్టుకుంటూ పోతారని విమర్శలు గుప్పించారు. తన మాటను వినకుంటే, జగన్ అవినీతి ఫైల్ పై కేసీఆర్ సంతకం పెడతారని అన్నారు. ఈ నెల రోజులూ ప్రతి ఒక్కరూ టీడీపీ విజయం కోసం ప్రతిక్షణం కృషి చేయాలని, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు చెప్పి, మరోమారు ఓటు వేయాలని అడగాలని సూచించారు.