Cricket: ఐసీసీ వరల్డ్ కప్ స్పాన్సర్ షిప్ దక్కించుకున్న 'గోడాడీ'
- పురుషుల టోర్నీ వరకే ఒప్పందం
- రూ.20 కోట్ల మేర డీల్
- మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్
గోడాడీ... వెబ్ ప్రపంచంతో పరిచయం ఉన్నవారికి దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డొమైన్ నేమ్ రిజిస్ట్రేషన్ నుంచి వెబ్ సైట్ హోస్టింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వరకు సింగిల్ ప్లాట్ ఫామ్ పై అందించే సత్తా ఉన్న సంస్థ గోడాడీ. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ సంస్థ ఇప్పుడు క్రికెట్ తో జతకట్టింది. ఈ ఏడాది ఇంగ్లాండ్ లో జరిగే వరల్డ్ కప్ టోర్నీకి అధికారిక స్పాన్సర్ గా ఒప్పందం కుదుర్చుకుంది గోడాడీ.
టెస్టు హోదా ఉన్న దేశాలతో పాటు అనేక ఐసీసీ సభ్యదేశాలు కూడా పాల్గొనే ఈ మేజర్ ఈవెంట్ ను స్పాన్సర్ చేసేందుకు గోడాడీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి రూ.20 కోట్లు చెల్లించనుంది. ఈ మెగా టోర్నీ ద్వారా తమకు విశేషమైన ప్రచారం లభిస్తుందని గోడాడీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే గోడాడీ ఒప్పందం పురుషుల టోర్నీ వరకే వర్తిస్తుంది. ఇంగ్లాండ్ వేదికగా ఒకే సమయంలో పురుషుల, మహిళల వరల్డ్ కప్ టోర్నీలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. మహిళల టోర్నీ స్పాన్సర్ ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.