Congress: అసోంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉగ్రవాద సంస్థే కారణం.. బాంబు పేల్చిన మాజీ డీజీపీ
- 2001 ఎన్నికల్లో కాంగ్రెస్ వెనక ఉల్ఫా
- భారీగా రిగ్గింగ్ జరిగింది
- ఉగ్రవాద సంస్థకు భారీగా డబ్బులు ముట్టజెప్పిన కాంగ్రెస్
అసోం మాజీ డీజీపీ శ్రీవాస్తవ బాంబు పేల్చారు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో అసోంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉగ్రవాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఉల్ఫా)నే కారణమని సంచలన ఆరోపణ చేశారు. అప్పట్లో కాంగ్రెస్-ఉల్ఫా మధ్య చాలా దగ్గరి సంబంధాలు ఉండేవన్నారు. శ్రీవాస్తవ గతంలో అసోం, త్రిపుర రాష్ట్రాలకు డీజీపీగా పనిచేశారు.
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఉల్ఫా ప్రత్యక్షంగా సహకరించిందన్నారు. ఇందుకోసం ఆ పార్టీ (కాంగ్రెస్) ఉగ్రవాద సంస్థకు భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పిందని ఆరోపించారు. అసోం గణపరిషత్ సభ్యులపై దాడి చేయాల్సిందిగా సంస్థ సభ్యులకు ఉల్ఫా కమాండర్ పరేశ్ భరౌహ్ రాసిన లేఖ తమకు లభ్యమైందన్నారు. అంతేకాక ప్రతిపక్ష సభ్యులతో డీల్ కూడా కుదుర్చుకున్నారని శ్రీవాస్తవ పేర్కొన్నారు.
2001 ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని, ఉల్ఫా సభ్యులు పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించారని మాజీ డీజీపీ పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 71 స్థానాలు, అసోం గణపరిషత్ 20 స్థానాలు గెలుచుకున్నట్టు చెప్పారు. ఉల్ఫా ప్రస్తుతం బలహీన పడిందని, త్వరలో జరగనున్న ఎన్నికలను ప్రభావం చేసే స్థితిలో అది లేదని శ్రీవాస్తవ పేర్కొన్నారు.