India: బతికున్నాడో లేడో తెలియని భర్త కోసం 47 ఏళ్లుగా ఎదురుచూస్తున్న పైలట్ భార్య

  • 1971లో పాక్ పట్టుబడిన విజయ్ తాంబే
  • విడుదల కోసం ఎదురుచూస్తున్న భార్య దమయంతి
  • భిన్న కథనాలు వినిపిస్తున్న సైన్యాధికారులు

భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ నిజంగా ఎంతో అదృష్టవంతుడు అని చెప్పాలి. పాకిస్థాన్ సైన్యాలకు పట్టుబడిన కొన్నిరోజుల్లోనే తిరిగి సొంతగడ్డపై అడుగుపెట్టగలిగాడు. కానీ, నాలుగు దశాబ్దాలుగా పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్న భారత సైనికులు ఇప్పటికీ స్వదేశానికి చేరుకోలేదు. వారిలో విజయ్ వసంత్ తాంబే అనే విమాన పైలట్ కూడా ఉన్నాడు. భారత వాయుసేనలో ఫ్లయిట్ లెఫ్టినెంట్ గా పనిచేస్తున్న తాంబే 1971లో పాకిస్థాన్ కు పట్టుబడ్డాడు. ఆ వార్తను రేడియోలో విన్న అతడి భార్య దయమంతి తాంబే కుప్పకూలిపోయింది. అప్పటికి వారి పెళ్లయి 18 నెలలే అయింది. కొత్త మురిపెం కూడా తీరని ఆ ఇల్లాలికి అది నిజంగా గుండెకోత అని చెప్పాలి.

దయమంతి తాంబే సాధారణ మహిళ కాదు. ఆమె మూడు సార్లు జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్. ఆటలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కోగలిగింది కానీ, నిజజీవితంలో ఎదురైన ఈ విషమ పరిస్థితిని మాత్రం తట్టుకోలేకపోయింది. అప్పటినుంచి ఆమె తిరగని కార్యాలయం లేదు, కలవని ప్రధాని లేడు! ఇప్పటివరకు ఎంతమంది ప్రధానులు పనిచేశారో అందరినీ కలిసి తన భర్త గురించి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు.

ప్రస్తుతం ఆమె వయసు 70 సంవత్సరాలు. దక్షిణ ఢిల్లీలోని మాణిక్ విహార్ లో తన చిన్న ఫ్లాట్ లో భర్త జ్ఞాపకాలతో కుమిలిపోవడం ఆమె నిత్యజీవితంలో భాగమైపోయింది. పెళ్లయిన కొత్తలో కాశ్మీర్ కు హనీమూన్ వెళ్లగా, అక్కడి ప్రకృతి అందాల్లో భర్తతో కలిసి తీయించుకున్న ఫొటోలే ఇప్పుడామెకు తరగని ఆస్తిగా మారాయి. ఆ ఫొటో ఆల్బంను గుండెకు పొదువుకుని భర్త ఎప్పటికైనా తిరిగొస్తాడని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది దయమంతి.

ఒకసారి పాకిస్థాన్ లో మగ్గిపోతున్న భారత ఖైదీల బంధువులకు తమవారిని చూసే అవకాశం వచ్చింది. మరికొన్ని గంటల్లో పాకిస్థాన్ వెళతామని అనుకునేంతలో రాజకీయ కారణాలతో ఆ పర్యటన రద్దయిపోయింది. అలాంటి చేదు అనుభవాలు దమయంతిని కొత్తల్లో చాలా బాధపెట్టేవి కానీ ఇప్పుడవి అలవాటయిపోయాయి. భర్త దూరమయ్యేడేమో కానీ, తరగని పెన్నిధిలాంటి అతని జ్ఞాపకాలు వెన్నంటే ఉన్నాయి కదా అంటూ జీవంలేని నవ్వును ముఖంపై పులుముకుంటుంది దమయంతి తాంబే.. వైఫ్ ఆఫ్ ఫ్లయిట్ లెఫ్టినెంట్ విజయ్ వసంత్ తాంబే.

  • Loading...

More Telugu News