Police: ఇథియోపియా విమాన ప్రమాదంలో అతనూ పోవాల్సిందే... కానీ బయటపడ్డాడు!
- ఆలస్యమే కాపాడింది
- దిగ్భ్రాంతికి గురైన ప్రయాణికుడు
- అనుమానంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆలస్యం అమృతం విషం అంటారు! కానీ ఈ వ్యక్తి విషయంలో ఆలస్యమే అమృతం అయింది. ఇథియోపియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 157 మరణించిన సంగతి తెలిసిందే. గ్రీస్ కు చెందిన ఆంటోనిస్ మావ్రోపౌలస్ అనే వ్యక్తి కూడా అదే విమానంలో ప్రయాణించాల్సి ఉంది. కానీ రెండే రెండు నిమిషాలు ఆలస్యంగా ఎయిర్ పోర్టుకు చేరుకోవడంతో అప్పటికే ఫ్లైట్ వెళ్లిపోయింది. ఆ ఆలస్యమే అతడి పాలిట అదృష్టంగా మారింది. నిర్ణీత సమయానికే గాల్లోకి లేచిన విమానం, టేకాఫ్ తీసుకున్న 6 నిమిషాల్లోనే కుప్పకూలి తీరని విషాదాన్ని మిగిల్చింది.
ఆంటోనిస్ మావ్రోపౌలస్ ఇంటర్నేషనల్ సాలిడ్ వేస్ట్ అసోసియేషన్ ఆనే ఎన్జీవోకు ప్రెసిడెంట్. ఆయన కెన్యా రాజధాని నైరోబీలో జరిగే ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సుకు వెళ్లడానికి అడిస్ అబాబా ఎయిర్ పోర్టుకు బయల్దేరారు. కానీ నిర్ణీత సమయంలోపు విమానాశ్రయానికి చేరుకోలేకపోయారు. దాంతో, అతడు టికెట్ బుక్ చేయించుకున్న విమానం మిస్సయింది. కానీ అదే అతడి ప్రాణాలను కాపాడింది. అయితే ఫ్లయిట్ మిస్ కావడంతో మరో విమానంలో టికెట్ బుక్ చేసుకున్నా దాంట్లో ఎక్కేందుకు సిబ్బంది అతడిని అనుమతించలేదు. అతడిపై అనుమానంతో పోలీసులకు అప్పగించారు. దాంతో పోలీసులతో వాగ్వివాదం పెట్టుకున్నాడు ఆ గ్రీస్ దేశస్తుడు.
అయితే, అక్కడి పోలీసులు చెప్పిన మాటలు విని మావ్రోపౌలస్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. "మీరు ఎక్కాల్సిన విమానం ఆచూకీ లేకుండా పోయింది... మీరు అందులో లేనందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి" అని ఓ ఆఫీసర్ అన్నాడు. కాగా, ఆ విమానంలో మావ్రోపౌలస్ ఎక్కకపోవడం, చివరికి అది కూలిపోయిన నేపథ్యంలో అతడిని పూర్తిగా విచారించిన తర్వాతే పోలీసులు విడిచిపెట్టారు.