Chandrababu: జగన్ ఓటమిని కేసీఆర్ కు 'రిటర్న్ గిఫ్ట్' గా పంపిస్తా: చంద్రబాబు ప్రతిజ్ఞ
- రిటర్న్ గిఫ్ట్ అంటే ఏంటో కేసీఆర్ కు తెలిసేలా చేస్తాం
- రిటర్న్ గిఫ్ట్ కు కొత్త అర్థం చెప్పిన ఏపీ సీఎం
- దమ్ముంటే ఏపీకి వచ్చి పోరాడాలని జగన్ కు సవాల్
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లను లక్ష్యంగా చేసుకుని నిప్పులు చెరిగారు. ఆదివారం కర్నూలు జిల్లాలో ఓ సభలో మాట్లాడుతూ... వైసీపీకి పెట్టుబడి పెట్టి ఎగదోయడమే తానిచ్చే రిటర్న్ గిఫ్ట్ అని కేసీఆర్ భావిస్తున్నారని, కానీ తాను జగన్ ను ఓడించి ఆ ఓటమిని కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ గా పంపిస్తానని చంద్రబాబు భీషణ ప్రతిజ్ఞ చేశారు.
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం ఎలాగా అని తాను ఆలోచిస్తుంటే, జగన్ మాత్రం లోటస్ పాండ్ లో కూర్చుని కొత్త కుట్రలకు తెరలేపుతుంటారని విమర్శించారు. వైసీపీ అధ్యక్షుడికి దమ్ముంటే ఏపీలో అడుగుపెట్టి టీడీపీతో తలపడాలని సవాల్ విసిరారు. "ఢిల్లీ మోదీ (నరేంద్ర మోదీ), హైదరాబాద్ మోదీ (కేసీఆర్), లోటస్ పాండ్ మోదీ (జగన్) ముగ్గురూ ఏపీ అభివృద్ధిని చూసి అసూయతో రగిలిపోతూ ఏ విధంగానైనా మనల్ని వెనక్కిలాగాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్లని ఎంతమాత్రం ఉపేక్షించను" అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.