Andhra Pradesh: ఓటర్ల జాబితాలో పేరుందో లేదో చూసుకోవాలి: ఏపీ ఈసీ ద్వివేది
- ఈ నెల 15 వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
- ఫారం-7 దరఖాస్తులు 9.27 లక్షలు అందాయి
- అందులో 5.25 లక్షల దరఖాస్తులను తిరస్కరించాం
ఓటర్ల జాబితాలో తమ పేరుందో లేదో ఓటర్లందరూ చూసుకోవాలని ఏపీ ఈసీ జీకే ద్వివేది సూచించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 15 వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఏపీలో మూడు కోట్ల 82 లక్షల మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా ఫారం-7 దరఖాస్తుల గురించి ప్రస్తావిస్తూ, ఇప్పటివరకూ 9.27 లక్షల దరఖాస్తులు అందాయని, అందులో 5.25 లక్షల దరఖాస్తులను తిరస్కరించామని చెప్పారు.
ఇంకా, లక్షకు పైగా ఈ దరఖాస్తులను పరిశీలించాల్సి ఉందని వివరించారు. ఫారం-7 దరఖాస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో సిట్ దర్యాప్తు చేస్తోందని, ఇందుకు సంబంధించి ఇప్పటి వరకూ 446 కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. త్వరలో ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్టు తెలిపారు. ఏపీలో ‘రైతు రుణమాఫీ’ చెల్లింపుల షెడ్యూల్ విడుదలపై ఈరోజు జారీ చేసిన జీవోను పరిశీలిస్తామని అన్నారు.