Andhra Pradesh: ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అనంతరం వైసీపీ, జనసేన ట్వీట్లు... ఇంకా స్పందించని టీడీపీ
- పవన్, జగన్ ఆవేశపూరిత పోస్టులు
- సమరశంఖం పూరించిన వైసీపీ అధినేత
- ఇది విప్లవం అని పేర్కొన్న జనసేనాని
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో రాజకీయ పార్టీలు మరింత హుషారు ప్రదర్శిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పూర్తిస్థాయి షెడ్యూల్ వెల్లడించింది.
ఏప్రిల్ 11న తొలి విడత పోలింగ్ జరుగుతుందని, మే 23న ఫలితాలు వస్తాయని ఈసీ తెలిపింది. మొత్తం ఏడు దశల్లో జరిగే ఎన్నికల కోసం పార్టీలన్నీ సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో, మొదటి దశలోనే ఎన్నికలు పూర్తిచేసుకోనున్న తెలుగు రాష్ట్రాల్లో మరింత జోరైన వాతావరణం కనిపిస్తోంది.
ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ సమరశంఖం పూరించారు. జగన్ సమరశంఖం పూరిస్తున్న చిత్రంతో వైసీపీ ట్విట్టర్ అకౌంట్ లో ఎన్నికల నగారా పోస్టు పెట్టారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని, ఏప్రిల్ 11న రాష్ట్రంలో ఎన్నికలు అని ఆ పోస్టులో పేర్కొన్నారు. అంతేగాకుండా, మాటతప్పని, మడమతిప్పని విశ్వసనీయతకు ఒక అవకాశం ఇద్దాం అంటూ ఆ పోస్టులో సూచించారు.
ఇక, జనసేన పార్టీ కూడా ఎన్నికల ప్రకటనను స్వాగతించింది. నిశ్శబ్ద విప్లవం మొదలైందని, పాతిక కిలోల బియ్యం కోసం కాదు, పాతిక సంవత్సరాల భవిష్యత్తు కోసం అనే నినాదంతో జనసేన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు ప్రత్యక్షమైంది. షెడ్యూల్ ప్రకటన మీడియాలో వచ్చిన వెంటనే, జనసేన ట్విట్టర్ అకౌంట్ లో ఎన్నికల పోరుకు సేన సిద్ధం అనే ట్వీట్ వెలువడింది. అయితే ఏపీలో అధికారపక్షంగా ఉన్న టీడీపీ మాత్రం ఇంకా తన స్పందన వెలిబుచ్చలేదు. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ అకౌంట్లలో దీనికి సంబంధించి ఎలాంటి ట్వీట్లు రాలేదు.