Andhra Pradesh: వైసీపీ గుర్తింపును ఈసీ రద్దు చేయాలి: మంత్రి సోమిరెడ్డి డిమాండ్
- ఓట్ల తొలగింపులో వైసీపీ కుట్ర బయటపడింది
- యూపీ, బీహార్, తెలంగాణలో ఓట్లు తొలగించే యత్నం
- రోజుకు లక్షన్నర చొప్పున ఫారం-7 అప్ లోడ్ చేసే ప్రయత్నం
ఓట్ల తొలగింపులో వైసీపీ కుట్ర బయటపడిందని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏ2 విజయసాయిరెడ్డి, బీహారీ పీకే, మోదీ బ్యాక్ గ్రౌండ్, జగన్ మోహన్ రెడ్డి కుట్రలన్నీ ఈరోజు బయటపడిపోయాయన్నారు. తమాషా ఏంటంటే, బీహార్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ నుంచి మెయిల్ ఐడీల ద్వారా దాదాపు యాభై లక్షల చిల్లర ఓట్లు తొలగించాలని ప్లాన్ చేశారని ఆరోపించారు. రోజుకు ఒకటిన్నర లక్షల ఓట్లు తొలగించేందుకు ఫారం-7ను వాడుకున్నారని అన్నారు.
గత నెలలో ఢిల్లీలో సీఈసీని కలిసిన విజయసాయిరెడ్డి, 59 లక్షల ఓట్లను తొలగించేందుకు టీడీపీ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపణలు చేశారని అన్నారు. ఫారం-7 ద్వారా ఫస్ట్ ఫేజ్ లో 9 లక్షల ఓట్లు, సెకండ్ ఫేజ్ లో నలభై లక్షలకు పైగా ఓట్ల తొలగింపునకు కార్యక్రమం ప్లాన్ చేశారని..ఈ లోగా వారి గుట్టు బట్టబయలైందని వైసీపీపై ఆరోపించారు. కేంద్రాన్ని, తెలంగాణాన్ని అడ్డుపెట్టుకుని ఏపీలో రాజకీయాలు చేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారని, వైసీపీ గుర్తింపును ఎన్నికల కమిషన్ రద్దు చేయాలని ఈ సందర్భంగా సోమిరెడ్డి డిమాండ్ చేశారు.