Andhra Pradesh: కేసీఆర్ ఇప్పటికే జగన్ కు రూ.1000 కోట్లు పంపాడు.. నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనన్నమాట!: చంద్రబాబు

  • అశోక్ కెరీర్ ను నాశనం చేశారు
  • తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు
  • అమరావతిలో మీడియాతో ఏపీ సీఎం

టీడీపీకి ఔట్ సోర్సింగ్ సేవలు అందించాడన్న కారణంతో ఐటీ గ్రిడ్స్ సంస్థ అధినేత అశోక్ కెరీర్ ను నాశనం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అతని కంపెనీపై దాడిచేసి మానసిక క్షోభకు గురిచేశారని ఆరోపించారు. దేశప్రజలంతా ఈ విషయం గురించి ఆలోచించాలని సూచించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘మా డేటాను దొంగిలించే అధికారం ఎవరు ఇచ్చారు? ఇది కుట్ర కాదా? మీ ఇష్టానుసారం వెళ్లడానికి ఇది ప్రజాస్వామ్యం అనుకున్నారా? లేక నియంత పాలన అనుకుంటున్నారా? ఇదంతా ఓవైపు జరుగుతుంటే జగన్, బీజేపీ, టీఆర్ఎస్ నేతలు గవర్నర్ ను కలుస్తారు. అందరూ కలిసి కుట్రను రక్తి కట్టిస్తున్నారు. గవర్నర్ ను కలిశాక బీజేపీ నేతలు సీబీఐ విచారణకు ఆదేశించాలని ఢిల్లీకి వెళ్లారు. సిగ్గులేకుండా తమ చర్యలను వీరంతా సమర్థించుకుంటున్నారు’ అంటూ మండిపడ్డారు.

కోడికత్తి కేసు రాష్ట్ర పరిధిలోని అంశం అయినప్పటికీ బలవంతంగా కేంద్రం తీసుకుందని చంద్రబాబు ఆరోపించారు. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు. ఏపీకి ఇవ్వాల్సిన ఆస్తులను తెలంగాణ ఇంకా ఇవ్వలేదన్నారు. రాష్ట్రం విడిపోయాక ఏపీకి చెందిన రూ.5 వేల కోట్ల కరెంటును వాడుకుని బకాయిలు ఇంకా చెల్లించలేదని విమర్శించారు.

‘ఇప్పుడు కేసీఆర్ ఇక్కడకు రాలేడు. వేల కోట్లు పంపిస్తాడు. ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు పంపాడని చెబుతున్నారు. నువ్వు(కేసీఆర్) సంపాదించిన డబ్బులు పెట్టుబడి పెడుతున్నావ్ ఇక్కడ. ఎందుకంటే నీకు ఓ సామంత రాజ్యం కావాలి. నీ సామంత రాజ్యం కోసం ఓ పథకం ప్రకారం జగన్ ను పెట్టుకున్నావ్. ఈయన నాకిచ్చే రిటర్న్ గిఫ్ట్ అదే అన్నమాట’ అని చంద్రబాబు తెలిపారు.

  • Loading...

More Telugu News