Andhra Pradesh: ‘గరుడపురాణం’ అంటూ గతంలో కథలు చెప్పాడు.. ఇప్పుడు పిచ్చికూతలు కూస్తున్నాడు!: శివాజీపై వైసీపీ అధికార ప్రతినిధి సుధాకర్
- తప్పు చేయకుంటే అశోక్ ఎందుకు పరారయ్యాడు?
- శివాజీతో బాబు వాజమ్మ ప్రకటనలు చేయిస్తున్నారు
- నటుడిపై మండిపడ్డ వైసీపీ నేత టీజేఆర్ సుధాకర్
ఎలాంటి తప్పూ చేయకుంటే ఐటీ గ్రిడ్స్ అధినేత అశోక్ పరారీలో ఎందుకు ఉన్నారని వైసీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని బజారులో పెట్టిన టీడీపీ గుర్తింపును రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో టీడీపీకి మద్దతుగా మాట్లాడిన నటుడు శివాజీపై ఈ సందర్బంగా సుధాకర్ మండిపడ్డారు. సినిమా ఆఫర్లు లేని శివాజీతో చంద్రబాబు వాజమ్మ ప్రకటనలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతంలో గరుడపురాణం పేరుతో కథలు చెప్పిన శివాజీ.. ఇప్పుడు డేటా చోరీ వ్యవహారంలో పిచ్చి కూతలు కూస్తున్నాడని మండిపడ్డారు. ఇలాంటి థర్డ్ గ్రేడ్ వ్యక్తులకు చంద్రబాబు ‘కీ’ ఇచ్చి ఆడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపించడంతోనే ఏపీ ప్రభుత్వం ఓట్ల తొలగింపుపై విచారణ చేపట్టకుండా యూటర్న్ తీసుకుని డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. శివాజీ పనీపాటా లేని వ్యక్తి అని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి 40 సీట్లకు మించిరావని స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.