Andhra Pradesh: ఢిల్లీలో మహాకుట్రకు నాంది పలికారు.. హైదరాబాదులో యాక్షన్ మొదలెట్టారు.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు!: సీఎం చంద్రబాబు

  • టీడీపీ డేటాను దొంగిలించి వైసీపీకి ఇచ్చారు
  • కేసు పెట్టకుండానే దాడులు నిర్వహించారు
  • అమరావతిలో మండిపడ్డ ఏపీ సీఎం

ఏపీలో మహాకుట్రకు నాంది పలికారని, ఒకవేళ ఈ విషయం బయటపడితే ప్రజలు ఛీ కొడతారు అన్న భయం కూడా లేకుండా బరితెగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ డేటాను దొంగిలించి వైసీపీకి ఇవ్వాలనీ, టీడీపీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. ఇందుకోసం వ్యవస్థలను దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరురాష్ట్రాల మధ్య కాకరేపుతున్న ఐటీ గ్రిడ్స్ కంపెనీ డేటా చౌర్యం వ్యవహారంపై చంద్రబాబు ఈరోజు అమరావతిలో మీడియాతో మాట్లాడారు.

ఈ ఘటనకు సంబంధించిన సాక్ష్యాలు తనదగ్గర ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. భారతదేశ చరిత్రలోనే ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు ఎన్నడూ జరగలేదని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ చాలా కేసుల్లో ఏ-1గా ఉన్నాడనీ, ఇంకా ఎన్ని కేసుల్లో ఏ-1 ముద్దాయి కావాలనుకుంటున్నాడో తెలియదని విమర్శించారు. ఆయనకు తోడుగా విజయసాయిరెడ్డి చాలా కేసుల్లో ఏ-2గా ఉన్నారని దుయ్యబట్టారు. ఈ ఏ-1, ఏ-2 వ్యక్తులకు పక్క రాష్ట్రపు పాలకులు, అధికారులు సాయం అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అధికారుల వ్యవహారశైలి దొరల దగ్గర పటేళ్లు పనిచేస్తున్నట్లు ఉందన్నారు.

మళ్లీ పటేల్ వ్యవస్థను తీసుకొచ్చి రాజకీయ పార్టీలపై దాడిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఓవరాక్షన్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని స్పష్టం చేశారు. ఈ కుట్రలో భాగంగా తొలుత ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారని చంద్రబాబు తెలిపారు. ఆ తర్వాత వ్యూహంలో భాగంగా హైదరాబాద్ లో ఎలాంటి ఫిర్యాదులు అందకుండానే ఐటీ గ్రిడ్స్ పై దాడులు నిర్వహించారని పేర్కొన్నారు. ఈ దాడుల తర్వాతే కేసు నమోదు చేశారని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి తొలి కథనం టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందన్నారు.

మొదటి స్కెచ్ ఢిల్లీలో.. రెండో స్కెచ్ హైదరాబాద్ లో


‘డేటా చోరీ వ్యవహారానికి సంబంధించి మొదటి స్కెచ్ వేసింది ఢిల్లీలో. ‘ఢిల్లీలో ఎన్నికల కమిషన్ కు మెమొరాండం సమర్పించారు. ఆ తర్వాత రెండో స్కెచ్ ను హైదరాబాద్ లో వేశారు. ఇక్కడ ఎటువంటి ఫిర్యాదు లేకుండా ‘యాక్షన్’, ఆ తర్వాత ఫిర్యాదు చేశారు. అంటే, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయకుండానే పోలీసులు వచ్చి దాడులు చేస్తారు, అక్కడి నుంచి ఇంకొకరితో ఫిర్యాదు చేయిస్తారు. ఒక పోలీసు ఒకటి చెబుతారు, ఇంకొక ఆయన ఇంకోటి చెబుతారు. ట్విస్ట్ ల పైన ట్విస్ట్ లు..ఇష్టానుసారంగా ప్రవర్తన.

19-2-2019 చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు విజయసాయిరెడ్డి ఓ వినతిపత్రం ఇచ్చారు. మూడు రోజుల తర్వాత అంటే, 22వ తారీఖున.. ఈ కుట్రలో భాగస్వామ్యమైన గవర్నమెంట్ ఉంది కనుక అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి ఓ నోట్ ఇచ్చారు. అందులో, వీళ్లు ఓ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నారు. ఆ కంప్లైంట్ తో పాటు ఈ యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చేశారు. ఎలక్షన్ కమిషన్ ఏం చేశారంటే.. కంప్లైంట్ రాసుకుని..యాక్షన్ ప్లాన్ కు కూడా సీరియల్ నెంబర్లు వేసి అవన్నీ యాక్షన్ కు పంపించారు. 23వ తారీఖున..వాళ్ల యాక్షన్ ప్లాన్ ప్రకారం యాక్షన్ స్టార్టయింది. ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్ వేర్ కంపెనీ పైన దాడులు చేశారు. ఇది చట్టవిరుద్ధం. డైరెక్టర్ అశోక్ ను ఎంక్వయిరీ చేశారు... మొత్తం డేటా అంతా దొంగిలించుకుపోయారు’ అని చంద్రబాబు వివరించారు.

’టాకింగ్ పాయింట్స్ ఆన్ సేవామిత్ర’ అన్న శీర్షికతో కుట్ర పత్రాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రూపొందించారని చంద్రబాబు ఆరోపించారు. సేవామిత్ర స్క్రీన్ షాట్ ను, అశోక్, లోకేశ్, రాజేశ్ తదతరుల ఫొటోలతో పాటు, కొన్ని పేపర్లను కూడా జత చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆ పత్రాన్ని మీడియా ప్రతినిధులకు అందజేశారు.

కుట్రలకు కూడా కార్యాచరణ ప్రణాళికా? ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేయాలో డేటా ఎలా సీజ్ చేయాలో చెబుతారా? ఉద్యోగుల సెల్ ఫోన్లు లాక్కోవాలని రాస్తారా? సేవామిత్ర యాప్ ని పనికిరాకుండా చేయాలంటారా? సీబీఐ ద్వారా విచారణ కోరాలని ఈ స్కెచ్ లో పెడతారా? ఫిర్యాదుదారే యాక్షన్ ప్లాన్ చెప్పడం ఎక్కడైనా ఉందా? అంటూ చంద్రబాబు మండిపడ్డారు.

సీఎం విడుదల చేసిన పత్రంలో అంశాలివీ 


కార్యాచరణ ప్రణాళిక

- ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, దొంగింలించిన సమాచారాన్ని స్వాధీనం చేసుకోవాలి. సర్వర్లు ఎక్కడున్నాయో గుర్తించాలి

- ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలసీజ్ సంస్థల డైరెక్టర్లు, రాష్ట్ర మంత్రులు, అధికారుల మధ్య సెల్ ఫోన్స్ ద్వారా, ఈ-మెయిల్స్ ద్వారా జరిగిన కమ్యూనికేషన్ ని సీజ్ చేయాలి

- సేవామిత్ర యాప్ ని నిరుపయోగం చేయాలి

- సేవా మిత్ర యాప్ కు సంబంధించి ఉన్నతస్థాయి నిర్వాహకులు, యాప్ లో నమోదైన వారిని గుర్తించాలి

- దీనిలో అక్రమాలను జాతీయ మీడియాకు వివరించాలి

- ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు విడిగాకేసు పెట్టాల్సిందిగా యూఐడీఏఐసీఈఓకి లేఖ రాయాలి

ఐటీ గ్రిడ్ సంస్థలో సోదాలు చేసినప్పుడు దృష్టి పెట్టాల్సిన అంశాలు


- సంస్థలో ఆధార్, ఎన్నికల సంఘం సమాచారం, వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి సమాచారం ఉందని రుజువు చేయాలి

- ఇలా వివిధ రకాల సమాచారాన్ని సేకరించేందుకు ఐటీ గ్రిడ్ సంస్థ సాఫ్ట్ వేర్ తయారు చేసిందని రుజువు చేయాలి

- సేవామిత్ర యాప్ ను ఏ సర్వర్ల నుంచి నిర్వహిస్తున్నారో వాటి ప్రదేశాన్ని గుర్తించాలి. ఆ డేటాబేస్ లను స్వాధీనం చేసుకోవాలి

- తొలగించాల్సిన ఓటర్ల జాబితాను రూపొందించారని నిర్ధారించాలి

- ఆ జాబితాను ఐటీ గ్రిడ్ సంస్థ టీడీపీలోనూ, ప్రభుత్వంలోనూ ఉన్న వారికి పంపిందని నిర్ధారణ చేయాలి

- ఐటీ గ్రిడ్ సంస్థ ప్రతినిధులు, ముఖ్యంగా సంస్థ ఎండీ అశోక్ టీడీపీ ముఖ్యులు, లోకేశ్, ఇతర అధికారుల మధ్య ఫోన్ సంభాషణలు, ఈ-మెయిల్స్, టెక్స్ట్, చాట్, వీఓఐపీ కాల్స్ తదితర మార్గాల్లో కమ్యూనికేషన్ జరిగినట్టు నిర్థారించాలి.

  • Loading...

More Telugu News