Andhra Pradesh: ట్రంప్ కూడా జగన్ కు సపోర్ట్ చేస్తున్నాడని అంటాడేమో.. చంద్రబాబుపై అవంతి శ్రీనివాస్ సెటైర్లు!

  • టీడీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు
  • లోకేశ్ కు నిజంగా దమ్ముంటే నాపై పోటీచేయాలి
  • రాబోయే ఎన్నికల్లో అధికార మార్పు తథ్యం

పేదలకు పప్పులు, బెల్లాలు ఇచ్చి ఏపీని టీడీపీ నేతలు దోచుకుంటున్నారని వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ విమర్శించారు. ప్రత్యేకహోదా తీసుకురావడంలో విఫలమైన చంద్రబాబు తన వైఫల్యాన్ని కేంద్రంపైకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు కేంద్రంపై పోరాడుతున్నట్లు నటిస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ లో ఈరోజు మీడియాతో అవంతి మాట్లాడారు.

లోకేశ్ కు నిజంగా దమ్ముంటే తనపై పోటీ చేయాలని అవంతి సవాల్ విసిరారు. ప్రలోభాలు, అరాచకాలు, వేధింపుల విషయంలో టీడీపీ నేతలు అన్ని హద్దులు దాటేశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు శ్రీకాకుళం వంటి మారుమూల ప్రాంతం నుంచి పోటీ చేయాలనీ, ఆ ప్రాంతం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ జగన్ వెనుక ఉన్నారని చంద్రబాబు చెప్పడంపై అవంతి సెటైర్లు వేశారు.

‘కొన్నాళ్ల పాటు కేసీఆర్ జగన్ కు మద్దతు ఇస్తున్నారని చంద్రబాబు చెప్పారు. ఇంకొన్ని రోజులు మోదీ జగన్ కు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. రేపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా జగన్ కు సపోర్ట్ చేస్తున్నారని అంటాడేమో’ అని చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు చూశారనీ, రాబోయే ఎన్నికల్లో అధికార మార్పు తథ్యమని స్పష్టం చేశారు.

Andhra Pradesh
YSRCP
Jagan
Telugudesam
Chandrababu
avanti srinivas
  • Loading...

More Telugu News