Andhra Pradesh: వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు.. కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన జగన్!
- కుమారుడు రత్నాకర్ తో కలిసి వైసీపీ తీర్థం
- వైసీపీలోకి భారీగా అనుచరులు, మద్దతుదారులు
- చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వీరభద్రరావు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వలసలు జోరందుకున్నాయి. తాజాగా విశాఖపట్నం జిల్లా సీనియర్ నేత దాడి వీరభద్రరావు ఈరోజు వైసీపీలో చేరారు. కుమారుడు రత్నాకర్, మద్దతుదారులు, అనుచరులతో కలిసి దాడి ఈరోజు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు రత్నాకర్ వైసీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. దీంతో వీరికి పార్టీ కండువా కప్పిన జగన్, వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం దాడి వీరభద్రరావు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో అవినీతి విలయతాండవం చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రజలను ఆయన ఎన్నడూ పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ఆయన సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ సిద్ధాంతాలను గాలికి వదిలేసి కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం దారుణమని మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీలో ఉన్నది తెలుగుదేశం కాదనీ, అది తెలుగు కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పోవడం, జగన్ సీఎం కావడం చారిత్రాత్మక అవసరమని వ్యాఖ్యానించారు.