Daadi Veerabhadrarao: కొణతాల ఎఫెక్ట్... వేగంగా మారిన విశాఖ రాజకీయం... జగన్ వద్దకు దాడి వీరభద్రరావు!
- గత మూడు వారాలుగా పెరిగిన ఫిరాయింపులు
- టీడీపీలో చేరిన కొణతాల రామకృష్ణ
- వెంటనే వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న దాడి
ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే ఓ పార్టీలో టికెట్ లభించని వారు మరో పార్టీలోకి ఫిరాయిస్తున్నారు. గడచిన మూడు నాలుగు వారాలుగా ఏపీలో ఫిరాయింపులు ఎక్కువైపోయాయి. తాజాగా, విశాఖ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ, టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకోవడంతో ఆయన మాజీ మిత్రుడు, కాంగ్రెస్ పార్టీ మరో నేత దాడి వీరభద్రరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు.
ఈ ఉదయం ఆయన హైదరాబాద్ లోని జగన్ నివాసానికి వచ్చి పార్టీలో చేరుతారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. 2014కు ముందు దాడి, కొణతాల ఇద్దరూ కొంతకాలం వైసీపీలో పనిచేసిన సంగతి తెలిసిందే. ఆపై ఇద్దరూ ఆ పార్టీని వీడారు. ఇప్పుడు తమతమ రాజకీయ భవిష్యత్తు కోసం కొణతాల టీడీపీని ఆశ్రయిస్తుండగా, దాడి వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకోవడం గమనార్హం. వీరిద్దరూ చెరో పార్టీలో చేరనుండటంతో విశాఖపట్నం రాజకీయాలు సమూలంగా మారిపోనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.