Facebook: ఉవ్వెత్తున ఎగసిన పేస్‌బుక్.. పడిపోతోందట!
- గతి తప్పుతున్న పేస్‌బుక్ లక్ష్యం
- దూషణలకు, ఆరోపణలకు, దుమ్మెత్తి పోసుకోవడానికే పరిమితం
- ఇన్‌స్టాగ్రామ్‌వైపు మొగ్గుతున్న యువత
ఫేస్‌బుక్.. నిన్నమొన్నటి వరకు యువతకు బ్యాంకు ఖాతా కంటే గొప్పది. ఏది ఉన్నా, లేకున్నా ఫేస్‌బుక్ ఖాతా లేకుంటే పిచ్చోడిని చూసినట్టు చూసే పరిస్థితి. సరదా కబుర్లకు, ఫొటోల షేరింగ్, వినోదానికి వేదికైన ఫేస్‌బుక్ సోషల్ మీడియాలో కింగ్‌గా అవతరించింది. అయితే, ఫేస్‌బుక్ అసలు ఉద్దేశం ఇప్పుడు తప్పుదారి పట్టింది. పొరపాటున ఫేస్‌బుక్‌లోకి వెళ్తే చాలు.. అసత్య వార్తలు, పుకార్లు, దుమ్మెత్తి పోసుకోవడాలు.. ఇవే కనిపిస్తున్నాయి. ఇవి నిత్యకృత్యం కావడంతో ఖాతాదారులు విసిగిపోతున్నారు. ఇక లాభం లేదని బైబై చెప్పేస్తున్నారు. అమెరికాలో ఫేస్‌బుక్‌పై ఎడిసన్స్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెలుగుచూసింది.
చాలామంది ఖాతాదారులు తమ అకౌంట్‌ను మూసేయడానికి పైన చెప్పిన అంశాలే కారణాలని ఎడిసన్స్ పేర్కొంది. అంతేకాదు, ఫేస్‌బుక్‌లో వ్యక్తిగత సమాచారానికి భద్రత లేదన్న ఆరోపణలు కూడా ఇందుకు మరో కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫేస్‌బుక్ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించిన కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ దానిని ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వాడుకుందున్న వార్తలు అప్పట్లో దుమారం లేపాయి.
గతంతో పోలిస్తే ఫేస్‌బుక్‌లో ఖాతా తెరిచే వారి సంఖ్య గణనీయంగా పడిపోతోందని ఈ నివేదిక తెలిపింది. ఒక రోజులో కేవలం 15 మిలియన్ల మంది మాత్రమే ఖాతాలు తెరిచినట్టు సర్వే తెలిపింది. ఫేస్‌బుక్ స్థానంలో వీరంతా ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తేలింది. ప్రస్తుతం దీనికి ప్రపంచవ్యాప్తంగా బిలియన్ మంది ఖాతాదారులున్నారు. ఇది కూడా ఫేస్‌బుక్ యాజమాన్యానిదే కావడం గమనార్హం.