Telangana: మాస్ కాపీయింగ్... 49 మంది నల్గొండ ఇంటర్ విద్యార్థుల డిబార్ తో కలకలం!
- శుక్రవారం నాడు స్క్వాడ్ తనిఖీలు
- కాపీ కొడుతూ పట్టుబడ్డ విద్యార్థులు
- ఇతర ప్రాంతాల్లోనూ విద్యార్థుల డిబార్
ఇంటర్ పరీక్షల్లో భాగంగా మాస్ కాపీయింగ్ చేస్తున్న 49 మంది విద్యార్థులను ఇంటర్ బోర్డు శుక్రవారం నాడు డిబార్ చేయడం కలకలం రేపింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు పరీక్షాకేంద్రాల్లో స్క్వాడ్ తనిఖీలు జరిగాయి. డిండిలో 21 మంది, కొండమల్లేపల్లిలో 9 మంది, చింతపల్లిలో 11 మంది, నల్లగొండ, యాదాద్రిలో నలుగురు విద్యార్థుల చొప్పున కాపీ కొడుతూ అధికారులకు పట్టుబడ్డారు. దీంతో వీరిని డిబార్ చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే, 11 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. 5వ తేదీన ఐదుగురు, 8న ఇద్దరు విద్యార్థులను డిబార్ చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. నిజామాబాద్ లోని ఎస్‌ఆర్ జూనియర్ కాలేజీలో ఓ విద్యార్థిపై కాపీయింగ్ కేసు నమోదు చేశారు. విద్యార్థులు తమ సొంత ప్రతిభపై ఆధారపడి పరీక్షలు రాయాలని, మాస్ కాపీయింగ్ కు పాల్పడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వుంటుందని అధికారులు హెచ్చరించారు.