India: పాకిస్థాన్ ను తృప్తిపరిచే మాటలు కట్టిపెట్టండి: విపక్షాలకు ప్రధాని హితవు
- దాడులు జరిగాయని పాక్ ఒప్పుకుంది
- ముందు ట్వీట్ చేసింది దాయాది దేశమే
- ప్రత్యర్థులపై మోదీ మండిపాటు
బాలాకోట్ దాడుల్లో ఎంతమంది చనిపోయారు? ఎంతమంది క్షతగాత్రులయ్యారు? అంటూ విపక్షాలు అర్థంలేకుండా మాట్లాడడం మానుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికారు. ఇలాంటి విషయాలు మాట్లాడేవాళ్లు పాకిస్థాన్ ను తృప్తి పరిచే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఘజియాబాద్ లో శుక్రవారం జరిగిన సభలో మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిప్పులు చెరిగారు. బాలాకోట్ లో దాడులు జరిగిన వెంటనే ఇస్లామాబాద్ వర్గాలే తొలి ట్వీట్ చేశాయని గుర్తుచేశారు. ఉగ్రస్థావరాలపై దాడులు జరిగాయనడానికి పాక్ చేసిన ఆ ట్వీటే నిదర్శనం అని అన్నారు. ఈ దాడుల్లో తాము ఎలాంటి లబ్ది కోరుకోలేదని మోదీ మరోసారి స్పష్టం చేశారు. "పాకిస్థాన్ ఏమైనా మూర్ఖురాలై ఈ ట్వీట్ చేసిందనుకున్నారా? 130 కోట్ల మంది దేశప్రజలే నాకు సాక్ష్యాలు. ఇకనైనా పాకిస్థాన్ కు వంతపాడే మాటలు చాలించండి" అంటూ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.