India: భారత్ లో అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీ ఏదో తెలుసా..!
- అగ్రస్థానంలో సమాజ్ వాదీ పార్టీ
- 2018లో రూ.47 కోట్ల ఆదాయం
- 'ఏడీఆర్' రిపోర్ట్ వెల్లడి
రాజకీయ పార్టీలు మనుగడ సాగించాలంటే నిధులు అవసరం. ఒక్కో పార్టీ ఒక్కో తరహాలో పార్టీ కార్యకలాపాలకు అవసరమైన నిధులు సేకరిస్తుంది. ఈ క్రమంలో భారత్ లోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది సమాజ్ వాదీ పార్టీ. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ 2017-18 సీజన్ కు గాను రూ.47.19 కోట్లతో అగ్రస్థానం అలంకరించింది. అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన నివేదికలో ఈ మేరకు వెల్లడించింది.
మొత్తం 37 ప్రాంతీయ పార్టీలను ఓ అధ్యయనంలో భాగంగా పరిశీలించి నివేదిక రూపొందించారు. అన్ని లోకల్ పార్టీల ఆదాయంలో 19.89 శాతం సమాజ్ వాదీ పార్టీయే ఆర్జిస్తోందట. ఇక, తమిళ రాజకీయ పార్టీ డీఎంకే రూ.35.74 కోట్లతో ద్వితీయ స్థానంలో ఉండగా, కేటీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ రూ.27.27 కోట్లతో మూడోస్థానంలో నిలిచింది. మొత్తం ప్రాంతీయ పార్టీల ఆదాయంలో ఈ మూడు పార్టీల వాటా 46.45 శాతంగా ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది.
కాగా, టీఆర్ఎస్ పార్టీ తన ఆదాయంలో రూ.22 కోట్లు కేవలం ఫీజులు, సబ్ స్క్రిప్షన్ల రూపంలోనే ఆర్జించినట్టు నివేదిక చెబుతోంది. ఇక తెలుగుదేశం పార్టీ అత్యధికంగా నిధులు ఖర్చు చేసిన పార్టీల జాబితాలో మూడోస్థానంలో నిలిచింది. 2017-18 సీజన్ లో టీడీపీ ఖర్చు రూ.16.73 కోట్లుగా పేర్కొన్నారు. ఈ జాబితాలో కూడా సమాజ్ వాదీ (రూ.34.54 కోట్లు), డీఎంకే (రూ.27.47 కోట్లు) తొలి రెండు స్థానాలు ఆక్రమించాయి.
ఇక, వైఎస్సార్సీపీ గురించి ఆసక్తికర విషయం వెల్లడైంది. జగన్ ఆధ్వర్యంలోని ఈ పార్టీ తన ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేసిన పార్టీల జాబితాలో టాప్ లో నిలిచింది. వైఎస్సార్సీపీ 2017-18 సీజన్ లో తన రాబడి కంటే రూ.2.41 కోట్లు ఎక్కువగా వినియోగించినట్టు ఏడీఆర్ నివేదిక చెబుతోంది.